‘ఓఖీ’ తుపాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి ఇప్పటివరకూ 14 మంది మరణించారు. 30 మంది జాలర్లు గల్లంతయ్యారు. వీరిలో 8 మందిని రక్షించారు. తుపాను ధాటికి తమిళనాడులో 10 మంది, కేరళలో నలుగురు మరణించారు.రాగల 24 గంటల్లో ఇది మరింత తీవ్రతరంగా మారే సూచనలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4వరకు పెనుతుపానుగా కొనసాగనున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుపాను నష్టంపై ఆరా తీశారు. తుపానుతో అల్లకల్లోలంగా మారిన తమిళనాడును అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.
మినికాయ్ దీవులకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఓఖీ 17 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని…. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.
భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో వందల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.