నూతన ఆవిష్కరణలు,వ్యాపారవేత్తలకు ఇండియా ఇంక్యుబేటర్‌గా పనిచేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. దక్షిణాసియాలోనే తొలిసారిగా జీఈఎస్ సదస్సు హైదరాబాద్‌లో జరగడం ఆనందంగా ఉందన్నారు. మహిళా సాధికారతతోనే మానవ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. హెచ్‌ఐసీసీలో జీఈ సమ్మిట్‌లో మాట్లాడిన మోడీ సిలికాన్ వ్యాలీని హైదరాబాద్‌తో అనుసంధానించడం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు.
భారత్-అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడమే ఈ సదస్సు లక్ష్యమని తెలిపారు. యుఎస్ స్పేస్ మిషన్లలో కల్పన చావ్లా,సునిత విలియమ్స్ పాల్గొన్నారని చెప్పారు. మహిళను శక్తిగా భారతీయులు విశ్వసిస్తారని మోడీ చెప్పారు. సైనా నెహ్వాల్,పివి సింధు,సానియా మీర్జా హైదరాబాద్‌కు చెందిన వారేనని తెలిపారు మోడీ . మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.
మహిళలు దృడ నిశ్చమంతో పనిచేస్తారని…స్వాతంత్ర్యోద్యమంలో కూడా మొక్కవోని పట్టుదలతో పనిచేసిన మహిళలున్నారని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందకుండా ఏ దేశ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. జీఈఎస్‌లో 50శాతానికి పైగా మహిళలే ఉన్నారని గుర్తుచేశారు. దేశంలో మూడు హైకోర్టులకు మహిళా న్యాయమూర్తులు ఉన్నారని తెలిపారు. గుజరాత్ పారిశ్రామికాభివృద్దిలో మహిళల పాత్రే కీలకమని తెలిపారు.వ్యవసాయ అనుబంధ రంగాల్లో 60 శాతం మహిళలే ఉన్నారని చెప్పారు.
మహిళా పారిశ్రామిక వేత్తలను పోత్సహించేందుకు సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. జీఈ సదస్సుకు ప్రపంచదేశాల నుంచి అగ్రశ్రేణి వ్యాపార వేత్తలు వచ్చారని తెలిపారు. ఆయుర్వేదం,యోగాను ప్రపంచానికి అందించింది భారతేనని స్పష్టం చేశారు మోడీ. ఆవిష్కరణలను ప్రోత్సహించడమే స్టార్టప్‌ల లక్ష్యమని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. దేశంలో ప్రతిగ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటి ఉండేలా చూస్తున్నామని తెలిపారు.
1200 చట్లాను రద్దు చేశామని తెలిపారు మోడీ. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ర్యాంకు మెరుగుపడిందని మోడీ తెలిపారు. జనధన్ యోజన అకౌంట్లలో 53 శాతం అకౌంట్లు మహిళలవేనన్నారు. ముద్రా యోజన పథకం ద్వారా 10 లక్షల రూపాయలను అందజేస్తున్నామన్నారు. నల్లధనాన్ని అరికట్టడంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతీ భారతీయుడికి ఆధార్ కార్డు ఇచ్చామని తెలిపారు. క్యాష్‌లెస్ లావాదేవీల కోసం బీమ్ యాప్‌ను విడుదల చేశామన్నారు. వైవిద్యమైన ఆలోచనలతోనే అభివృద్ధి సాధ్యమని మోడీ స్పష్టం చేశారు.