ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు(జీఈఎస్)లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఉదయం 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్న ఇవాంకాకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇవాంకా రాక సందర్భంగా నగరం సుందరంగా ముస్తాబైంది.
జీఈఎస్ కు హాజరవుతున్న ఇవాంకాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేలా చేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని ఏపీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.ఇవాంకా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తామని అమెరికా కాన్సులేట్‌కు చెప్పారు. అయితే, ఇందుకు అమెరికా ప్రభుత్వం ససేమీరా అంది. జీఈఎస్ మినహా ఇవాంకా మరెక్కడా పర్యటించబోరని తేల్చి చెప్పింది.
ఇవాంకాను ఏపీకి తీసుకురావడం ద్వారా ఏపీకి ఓ బ్రాండ్ తీసుకురావాలని చంద్రబాబు భావించారు. అంతేగాదు అమెరికా కంపెనీల పెట్టుబడులు కూడా ఆకర్షించే అవకాశాలుంటాయని అంచనా వేశారు. కానీ చంద్రబాబు ప్రయత్నాలకు ఇవాంకా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ – 2017 మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.