ప్రకృతి పూల సోయగం….. ‘బతుకమ్మ’

2509
floral festival
- Advertisement -

బతుకమ్మ పండగలో ప్రథమ స్థానం పూలదే. ఏటి గట్లపై, పొలం గట్లపై విరబూసిన అచ్చమైన పల్లె పూలే బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. రంగురంగుల హరివిల్లులా పరుచుకుంటాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వుతో.. తీరు తీరున బంగారు బతుకమ్మను అలంకరిస్తారు.

తంగేడు, బంతిపూలు, చేను చెలకలలో పెరిగే గునుగుపూలు, పట్టుకుచ్చులు, ముళ్ళకంచెలపై కనిపించే కట్లపూలు, పెరట్లో పెరిగే మందారాలు, గన్నేరు.. గుమ్మడి.. ఒక్కటేమిటి ఎన్నో రకాల పూలు బతుకమ్మలో కొలువవుతాయి. అందుకే ఈ పండగ ప్రకృతిని ఆరాధించే చిహ్నంగా కీర్తిపొందుతోంది.

Bathukamma

తంగేడు, గునుగు, పసుపు ముద్ద ఇలా ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలవి. నీటిని శుద్ధి చేసేందుకు ఉపయోగపడతాయని ప్రజల నమ్మకం. తెల్లవారుజామునే సేకరించిన పూలన్నింటిని ఇత్తడి తాంబూలంలోనో, మేదరి సిబ్బిలోనో పేరుస్తారు. అయితే బతుకమ్మను తయారు చేయడంలో మహిళల సృజనాత్మకత కనబడుతుంది. అరచేతిలో పట్టుకునే బతుకమ్మను మొదలుకుని ఆరడుగుల బతుకమ్మ వరకు తయారు చేస్తారు. పసుపుతో చేసిన గౌరమ్మతో బతుకమ్మను అలంకరించగానే ఆ అందం మరింత రెట్టింపవుతుంది.

తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ. విరుల సౌరభంతో పుడమి తల్లి పులకించే ఈ వేడుకలో ఎన్నో విశేషాలు దాగున్నాయి. ప్రకృతి పూల పరిమళంతో బతుకమ్మ వికసిస్తుంది. తంగేడు పరిమళం,గునుగులోని సోగసు,కట్లపూల సోయగం ఒకే దగ్గర కనిపించే అరుదైన అద్భుతం బతుకమ్మ. తీరొక్క పూలతో అందంగా రూపుదిద్దుకునే బతుకమ్మలో ఎన్నో ఔషథ గుణాలున్నాయి. ప్రకృతి పూజకు నిదర్శనం బతుకమ్మ.9 రోజుల పాటు ప్రకృతి పూలతో సాగే పండుగ బతుకమ్మ. బతుకమ్మలో వాడే పూలలో ఎన్నో ఔషథ గుణాలున్నాయి. హానికారక క్రిముల నాశనంతో ఈ పూలు ముందువరుసలో ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను దరిచేరనీయవు.

తంగేడు పూలు

బతుకమ్మలో ముందువరుసలో ఉండేవి తంగేడు పూలు. సెప్టెంబర్,అక్టోబర్ మాసాల్లో మాత్రమే లభించే తంగేడు….పసిడి వర్ణంలో వెలిగిపోతుంటాయి. ఈ పూలకు ఔషథ గుణాలు ఎక్కువే.మరిగించిన తంగేడు పూలు జ్వరం,చక్కెర వ్యాధి,మలబద్ధకానికి చక్కని ఔషధం. ఎండిన పూలు,మొగ్గలను మరిగించి టీ చేసుకుని తాగవచ్చు.

గునుగు పూలు

గునుగు పూలకు విశేషచరిత్ర ఉంది. ఇవి రక్త స్రావాన్ని నివారిస్తాయి. పరాన్న జీవులను దరిచేరనీయవు. గునుగు గింజలు రక్త విరోచనాలు,అతిసార వ్యాధులకు దివ్యాఔషధం. కంటి వ్యాధులు,శుక్లాలకు గునుగుపువ్వు చక్కని విరుగుడు.రక్తపోటును అదుపులో ఉంచటంలో దీనికి మరేది సాటిరాదు.

bathukamma

రుద్రాక్షలు

ఎర్రని రంగులో నిగనిలాడే రుద్రాక్షలు వాపును తగ్గిస్తాయి. పుండ్లు,గడ్డలని మటుమాయం చేసే సామర్థ్యం ఈ పూలకు ఉంది. కాడ్మియం లాంటి లోహాలతో కలుషితమైన భూమిని శుద్దిచేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

పట్టుకుచ్చు

బతుకమ్మలో కుచ్చులాంటి పూలను పట్టుకుచ్చు అంటారు. అందంతో పాటు వెలకట్టలేని ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయి. ఆకులు కాండం పుండ్లకి తెగిన చర్మానికి మంచి మందుగా ఉపయోగపడుతాయి. గింజలు జీర్ణకోశ వ్యాధులు పేగు సంబంధ వ్యాధులను నివారిస్తాయి. జ్వరం, కాలేయ వ్యాధులను దరిచేరనీయదు. పాము విషానికి చక్కని విరుగుడ పట్టుకుచ్చు.

గడ్డిపూలు…

బతుకమ్మలో ఉపయోగించే మరో పూలు గడ్డిపూలు. ఈ మొక్కల్లో ఉబ్బసం,కోరింత దగ్గు, విరేచనాలను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. పసిపిల్లల జ్వరం కళ్ల మంటలు పిల్లల నిద్రలోని ఏడుపుకి మంచి మందుగా ఉపయోగపడుతుంది. గొంతు కాళ్ల నొప్పులను ఇట్టే తగ్గిస్తాయి. జీర్ణ క్రియని పెంచి ఆకలిని కలిగిస్తాయి.

చామంతులు

పసుపు వర్ణంతో మెరిసే చామంతులు బతుకమ్మను ఎంతో ఆకర్షణీయంగా మారుస్తాయి. చామంతి ఆకులతో తయారుచేసే టీ జలుబు,గొంతునొప్పిని తగ్గిస్తుంది. మొటిమలను తగ్గించటం, శరీరాన్ని చల్లబర్చటంలో చామంతి కీలకపాత్ర పోషిస్తుంది. కాలేయ సంబంధ వ్యాధులకు చామంతి దివ్యౌషధం. ఒత్తిడి కోపం లాంటి బావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.

గుమ్మడిపూలు…

బతుకమ్మకు తలమానికంగా అగ్రభాగాన ఉండే గుమ్మడిపూలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కీళ్ల వాతాన్ని తగ్గించటం, అతి మైత్రవ్యాధి,మూత్ర పిండ సమస్యలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. పేగు సంబంధ వ్యాధులను తగ్గించటంలో ముందుంటుంది. గుమ్మడికాయ గుజ్జు పొడిభారిన చర్మానికి మొటిమలు మచ్చలు కాలిన గాయాలను తగ్గిస్తుంది.

మందరాలు

మందరాల సోయగం వర్ణించరానిది. కుంకుమ శోభను తెచ్చేవి మందారాలు. మందారపు ఆకులు రక్తప్రసరణ సరిచేసి రుతుస్రావాన్ని నియంత్రిస్తాయి. కాలేయపు వ్యాది,రక్తపోటు సంబంధించిన మందులను వీటితో తయారుచేస్తారు. లేత మందారపు ఆకులు తలనొప్పిని ఇట్టేహరిస్తాయి. ఆకులను వేరుని మరిగించి తాగితే దగ్గు మటుమాయమవుతుంది. శిరోజాల సంరక్షణల మందారాన్ని మించిన మందులేదు.

bomma

నందివర్ధనాలు..

ధవళ వర్ణాల్లో మెరిసే నందివర్ధనాల్లో గొప్ప ఔషధ గుణాలున్నాయి. కంటి సంబంధ వ్యాధులను దరిచేరనీయదు. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

కనకంబరాలు…

కనకంబరాల్లో లెక్కకు మించిన ఔషధ గుణాలున్నాయి. ఆకులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పూలు సూక్ష్మజీవులు,బ్యాక్టీరియా,ఫంగస్ లను నిర్మూలిస్తాయి.

బంతిపూలు..

ఎన్నిరకాల పూలు ఉన్న బంతికి సాటిరావు అన్నది కాదనలేని నిజం. బంతి నూనే దద్దుర్లు,నొప్పులు తగ్గిస్తాయి. ఫంగస్,బ్యాక్టీరియా,కళ్ల కలతలు,కాలిన గాయాలు,చర్మ సంబంధ అంటు వ్యాధులను దరిచేరనీయవు.

చల్లగుత్తిపూలు…

బతుకమ్మకు అందం తెచ్చే మరో పూవు చల్లగుత్తి. పురిటినోప్పులకు మంచిమందు. తవద బిళ్లలు, కీళ్ల వాతానికి మందుగా ఉపయోగపడుతాయి. పొత్తి కడుపు నొప్పికి దీని ఆకులు చక్కగా పనిచేస్తాయి. విరోచనాలను దరిచేరనీయవు.

బీరపూలు..

సుకుమారంగా ఉండే బీరపూలు చర్మంలోని విషాలను బయటకు తీసివేస్తాయి. జలుబుని రానివ్వకుండా చూస్తుంది. సైనస్‌ను అరికట్టడంలో ఉపయోగపడుతుంది. తల్లిపాల వృద్ధి,రుతుచక్రాన్ని సరిచేయటంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.

కాశీరత్నం పూలు..

ఎరుపురంగులో వెలిగిపోయే కాశీరత్నం పువ్వు ఫంగస్‌ ను అరికడుతుంది. అతిమూత్రవ్యాధి,మల్లబద్దకాన్ని అదుపులో ఉంచుతుంది. నొప్పి వాపు గడ్డలకు చక్కని మందు. గన్నేరు పూలలో ఇనుము,కాల్షియం,విటమిన్ బి6 విరివిగా ఉంటాయి. కండరాల నొప్పిని తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. రోగనిరోదక శక్తి, జ్ఞాపకశక్తి పెంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి.

నేలగులాబీలు..

కాలేయ వ్యాధులు అరికట్టడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. పాము, కీటకాల కాటు, తామరకి నేలగులాబీ ఆకుల రసం చక్కగా పనిచేస్తుంది. అతిసార గుండెజబ్బుల నివారణకు తామరపూలు చక్కగా ఉపయోగపడతాయి. దీని విత్తనాలు చర్మవ్యాధులు కుష్టు నివారణకు ఉపయోగపడతాయి.

గులాబీలు…

బతుకమ్మలో గులాబీలకు ప్రత్యేక స్ధానం ఉంది. మరికా ఆసిడ్,టానిక యాసిడ్ ఉండటం వలన తైలాలు,ఆయుర్వేద పరంగా వ్యాధులను నయం చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. అనేక రుగ్మతలను ఇది నయం చేస్తుంది. కంటిజబ్బులకు మంచి ఔషథం యాంటి బయోటిక్‌ గా పనిచేస్తుంది. ముఖవర్చస్సును పెంచే సాధనాల్లో గులాబీది మొదటిస్ధానం.

మల్లె సువాసనలు మైమరింపచేస్తూ….చక్కని క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. లిల్లీపూలు గుండె వేగాన్ని అదుపులో ఉంచుతాయి. ప్రసవానంతరం వ్యాధులను దరిచేరనీయవు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టడంలో బతుకమ్మ పండగలో వాడే పూలు చక్కగా ఉపయోగపడతాయి. అందుకే ప్రకృతి పండుగగా గుర్తింపు తెచ్చిన బతుకమ్మ పూలకు విశేష చరిత్ర ఉంది.

Also Read:గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

- Advertisement -