హైదరాబాద్ గ్లోబర్ ఎకనమిక్ సదస్సుకు సర్వం సిద్దమైంది. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక పాల్గొనున్నారు. ఇవాంక పర్యటన నేపథ్యంలో నగరంలో పటిష్ట భద్రతను ఏర్పాటుచేశారు. ఆమె టూర్‌కి సంబంధించిన వివరాలన్ని గోప్యంగా ఉంచారు. మంత్రి కేటీఆర్…ఇవాంక టూర్‌కి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ టూర్ కోసం తాను ఎదురుచూస్తున్నాని ఇవాంక పేర్కొంది. గ్లోబల్ ఎకనమిక్ సదస్సు.. భారత, అమెరికాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందన్నారు. భారత్ తో రక్షణ, ఆర్థిక సంబంధాలను పెంచుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. సదస్సుకు హాజరయ్యేందుకు ఎదరు చూస్తున్నానని అన్నారు. జూన్ లో మోడీ అమెరికా వచ్చినపుడు.. తనను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించారని.. అది గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
గతంలో విదేశీ ప్రముఖులు హైదరాబాదుకు వచ్చినప్పుడు వారికి గత ముఖ్యమంత్రులు జ్ఞాపికగా చార్మినార్ ప్రతిమను అందజేసేవారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల హయాంలో బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లు హైదరాబాదు పర్యటనకు రాగా, వారికి చార్మినార్ మెమొంటోను అందజేశారు.
ఇవాంకా విషయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ బాక్స్ ను అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో చార్మినార్ మెమొంటోతోపాటు, హైదరాబాద్ స్వర్ణకారులు ప్రత్యేకంగా రూపొందించిన బంగారు నగలు, గద్వాల, సిరిసిల్ల నేతన్నలు ప్రత్యేకంగా రూపొందించిన చేనేత చీరలను ఉంచనున్నట్లు సమాచారం.