బాలీవుడ్ దర్శకుడు సంజయ్ భన్సాలీ రూపొందించిన పద్మావతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు రాష్ట్రాల సీఎంలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం సినిమాపై నిషేదం విధించాలని ఆందోళన బాటపట్టారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం భన్సాలీ చేసింది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు పద్మావతికి మద్దతుగా నిలిచారు. అయితే బన్సాలీ మాత్రం నిరవధికంగా సినిమాను వాయిదా వేశారు.
పద్మావతి సినిమాపై తమ నమ్మకం ఏమాత్రం సడలిపోలేదనీ, ఈ వివాదం నుంచి పద్మావతి గట్టెక్కుతుందనీ, భారతీయ సినిమాని ఓ మెట్టు పైకెక్కించేలా సినిమా ఉండబోతోందనీ తెలిపారు. ‘పద్మావతి’ ఓడిపోదనీ, కొందరు ఆరోపిస్తున్నట్లుగా సినిమాలో వివాదాస్పద అంశాలు లేనే లేవని అన్నాడు. భన్సాలీ కష్టం వృధాగా పోదని రణ్‌వీర్‌సింగ్ వ్యాఖ్యానించాడు.
షాహిద్‌కపూర్ సైతం, ‘సినిమాని నెగెటివ్ కోణంలో చూడొద్దు.. అది సినీ పరిశ్రమకే మంచిది కాదు..’ అంటూ చెప్పుకొచ్చాడు. దీపిక తల నరికి తేవాలంటూ ప్రకటిస్తున్న వారిపై కమల్ హాసన్ మండిపడ్డారు. ఏ రంగంలోనైనా కావచ్చు అతివాద ధోరణులు మంచివి కావన్నారు. ఆ విషయం చెప్పీ చెప్పీ అలసిపోయామని, మేధావులారా మేల్కొనండి, ఆలోచించండి.. భరతమాతా.. ఆలకిస్తున్నావా!’ అని ట్వీట్లో కమల్ పేర్కొన్నారు.