‘నేను శైలజా’ సినిమాతో మంచి ఊపుమీద ఉన్న రామ్ హైపర్ మూవీ తో మరింత ఎనర్జటిక్ గా వచ్చేశాడు. ‘అలాంటి వాడు ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’అనే క్యాప్షన్ తో హైపర్ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తుంది. రామ్ కు కందిరీగ సినిమాతో హిట్ అందించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలే ఉంటాయి. మరి భారీ అంచనాల మధ్యన, పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
కథ :
సూర్య(రామ్) ఆలియాస్ సూరి చురుకైన కుర్రాడు. సూర్య తండ్రి నారాయణ మూర్తి(సత్యరాజ్). మూర్తి నిజాయితీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. సూర్యకు ఆయన తండ్రి మూర్తి అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. తండ్రి కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటాడు సూరి. ఇక రిటైర్మెంట్‌కు దగ్గర పడిన సమయంలో నారాయణ మూర్తికి రాజప్ప (రావు రమేష్) అనే ఓ మినిష్టర్ నుంచి ఇబ్బంది తలెత్తుతుంది. అంతలోనే భానుమతి(రాశిఖన్నా) ప్రేమలో పడతాడు సూర్య. ఇంతకి భానుమతి ఎవరు? రామ్ తన తండ్రి సమస్యను పరిష్కరిస్తాడా..??ఆ మినిస్టర్ వీరిని వదులుతాడా..?? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఎనర్జిటిక్ హీరోగా పేరున్న రామ్ తన గత చిత్రాలలాగే ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నాడు. తన పేరుకులాగే ఈ చిత్రంలో కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. కామెడీ, యాక్షన్, డ్యాన్స్.. ఎక్కడా తగ్గకుండా రామ్ సినిమాను తన భుజాలపై నడిపించాడు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ విషయంలో ఎప్పట్లానే అదరగొట్టాడు. రాశిఖన్నా క్యూట్‌గా బాగా చేసింది. కొన్నిచోట్ల అందాలతో కనువిందు చేస్తూ కూడా ఆకట్టుకుంది.
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫస్టాఫ్ నెరేషన్ అనే చెప్పుకోవాలి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ నుండి చివరివరకూ కామెడీ ఎక్కడా తగ్గకుండా బాగుంది. సెకండాఫ్‌లో హీరో, అతడి తండ్రి మధ్యన వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటూ బాగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి పాత్రనిచ్చినా తన ప్రెజెన్స్‌తో సినిమానే మరోస్థాయికి తీసుకెళ్ళగలనని రావు రమేష్ ఈ సినిమాతోనూ ఋజువుచేశాడు. రామ్ తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించాడు. ఇక మిగిలిన పాత్రలో నటించిన వారు తమ పాత్ర పరిధిలో నటించి మెప్పించారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు ఎంచుకున్న ఈ కథ రొటీన్ ఫార్మాట్ కావడం.. ఇలాంటి కథను చాలా సినిమాల్లో ఎక్కడో ఒకదగ్గర కనిపిస్తూనే ఉంటాయి. ఇక హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా కాస్త సిల్లీగా కనిపించింది. పాటలు సినిమా మూడ్‌ను దెబ్బతీయడమే కాకుండా బోరింగ్‌గా కూడా అనిపించాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో పాటలు అన్నీ అసందర్భంగానే రావడం మైనస్సే! అలాగే రాశి ఖన్నా పాత్ర సెకండాఫ్‌లో పూర్తిగా కనిపించకుండా పోవడం కూడా బాగోలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ హైపర్‌ను సైతం కమర్షియల్‌గా సక్సెస్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఫస్టాఫ్ నెరేషన్ విషయంలో సంతోష్ శ్రీనివాస్ కట్టిపడేశాడనే చెప్పాలి. అయితే హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ సరిగ్గా లేకపోవడం, సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన పాటలు పెట్టడం లాంటి విషయాల్లో సంతోష్ తడబడ్డట్టనిపించింది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. జిబ్రాన్ అందించిన సంగీతం ఫర్వాలేదనేలా ఉంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలకు బాగున్నాయి.
తీర్పు :
పాత కథ అయినా కూడా దర్శకుడు కొత్తగా తెరకెక్కించాడు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమ అనే పాయింట్‌ను మూంగా తీసుకున్న దర్శకుడు దానికి తోడా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాడు. తండ్రంటే విపరీతమైన ప్రేమ ఉండే హీరో క్యారెక్టరైజేషన్‌ను జతచేసి, ఎక్కడా కామెడీ తగ్గకుండా, కథలోని ఎమోషన్‌ను చివరివరకూ కొనసాగిస్తూ అల్లిన స్ర్కీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధానం. హీరో రామ్ కూడా తన ఎనర్జీతో పాత్రలో జీవించి మంచి నటన కనబర్చాడు. మాస్ టైటిల్‌లాగే మాస్ సన్నివేశాను చిత్రీకరించి మాస్ ప్రేక్షకును కూడా ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ హైపర్ లాంటి కుర్రాడు ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.
విడుదల తేదీ : 30/09/ 2016
రేటింగ్ : 3/5
నటీనటులు : రామ్, రాశి ఖన్నా
సంగీతం : జిబ్రాన్
నిర్మాత : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్