గత పది సంవత్సరాలలో 35 వేల మందికి పైగా తెలుగు బాలలకు అమెరికా వ్యాప్తంగా 250 పైగా కేంద్రాలలో తెలుగు భాష నేర్పిస్తున్న మనబడి నిర్వహిస్తున్న సిలికానాంధ్ర చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం ‘సంపద ‘. భారతీయ సంప్రదాయ సంగీత, నృత్య కళలు నేర్చుకుంటున్న ప్రవాస భారతీయులకోసం ఏర్పాటు చేసిందే ఈ సంపద. సంపద అంటే.. Silicon Andhra Music Performing Arts & Dance Academy.
ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలోని గురువులు, లేదా భారతదేశంలోని గురువుల ద్వారా సంగీతం, వాయిద్యం, నృత్యం నేర్చుకుంటున్న చిన్నారులు ఎందరో ఉన్నారు. కచేరీలు ఇస్తున్నా, రంగప్రవేశాలు జరిగినా, వారికి ఆ కళల ద్వారా (విద్య) ఎకడమిక్ సర్టిఫికేట్ లు అందుబాటులో లేవు. అందుకే సిలికానాంధ్ర – హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం తో సంయుక్తంగా ఈ సంపద అనే విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ గురువు దగ్గర నేర్చుకున్నా, సిలికానాంధ్ర-తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించే పరీక్షలు ఉత్తీర్ణులవడం ద్వారా లభించే సర్టిఫికేట్ (ధ్రువీకరణ పత్రం) .. వివిధ విశ్వవిద్యాయాలలో జేరే సమయంలో యూనివర్సిటీ క్రెడిట్లు గా ఆమోదింపబడతాయి. మొత్తం నాలుగేళ్ళ కోర్సు గా ఉండే ఈ సంపద పరీక్షల ద్వారా మొత్తం 32 క్రెడిట్ లు పొందే అవకాశం లభిస్తుందని సిలికానాంధ్ర సంపద కులపతి దీనబాబు కొండుభట్ల తెలిపారు.
మొదటి సంవత్సరం నుంచి నేరుగా రెండవ సంవత్సరంలోకి ప్రవేశించడానికి జరిగిన స్కిప్ లెవెల్ ఎసెస్‌మెంట్ పరీక్షలలో అమెరికా వ్యాప్తంగా దాదాపు 250 మంది విద్యార్ధులు సంగీతం, వాయిద్యం, నాట్యం కు సంబంధించిన థియరి మరియు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు. మిల్పిటాస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం లో జరిగిన పరీక్షలతో పాటుగా, వివిధ ప్రాంతాలలో జరిగిన పరీక్షలను ప్రత్యక్షంగా కొందరు గురువులు పర్యవేక్షించగా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్కైప్ వంటి అంతర్జాల మాధ్యమాల ద్వారా భారత దేశం నుంచి మరికొంతమంది గురువులు పరీక్షించి అర్హత పరీక్షలను నిర్వహించారని, వారికి త్వరలోనే సంపద వెబ్ సైట్ ద్వారా ఫలితాలు విడుదల చేస్తామని సిలికానాంధ్ర చీఫ్ ఆపరేటిన్ ఆఫీసర్ రాజు చమర్తి తెలిపారు.