టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అండగా నిలిచాడు కెప్టెన్ కోహ్లి. ఒక్క మ్యాచ్ విఫలమైనంతా మాత్రాన ధోనిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని మండిపడ్డాడు. ధోనిని తిట్టడం ప్రతిఒక్కరికి ఫ్యాషన్‌గా మారిందని…తనతో పాటు కొంతమంది ఆటగాళ్లు కూడా ఫెయిలవుతున్నారని కానీ ధోని ఒక్కడినే టార్గెట్ చేసి మాట్లాడటం సరికాదన్నాడు.
కేరళలో టీ20 మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘ధోనీని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు అర్థం కావడంలేదు. ఒక బ్యాట్స్‌మెన్‌గా నేను వరుసగా మూడు సార్లు విఫలమైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే నా వయసు ఇంకా 35 సంవత్సరాలు కాదు కాబట్టి. ధోనీ ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్‌పై నిర్వహించిన అన్ని టెస్టుల్లో పాసవుతున్నాడు. మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడని తెలిపాడు.
కీవిస్‌తో జరిగిన రెండో టీ20లో సరైన సమయంలో ధోనీ వేగంగా పరుగులు చేయకపోవడంతో అతనిపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. లక్ష్మణ్, అగార్కర్లాంటి మాజీలైతే ఇక ధోనీ టీ20ల నుంచి తప్పుకోవాలని కూడా అన్నారు. అయితే వాళ్ల వాదనను తప్పుబట్టాడు కోహ్లి. ధోనీ ఏంటో అతనికి బాగా తెలుసని, అతని గురించి అతనే నిర్ణయం తీసుకుంటాడు తప్ప మిగితా ఎవరికీ హక్కు లేదని విరాట్ స్పష్టంచేశాడు.