ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసలు గుప్పించారు. అసెంబ్లీలో మైనార్టీ సంక్షేమంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ…ఏ కులమైనా మతమైనా కేసీఆర్ దృష్టిలో సమానమేనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
ఉమ్మడి ఏపీలో మైనార్టీలు బడ్జెట్ కోసం పోరాటం చేశారన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఉద్ఘాటించారు. కేసీఆర్ వచ్చాకే ఫీజురియింబర్స్‌మెంట్ విషయంలో ముస్లిం విద్యార్థులకు న్యాయం జరిగింది. షాదీముబారక్ స్కీం తెచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు ఓవైసీ. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయన్నారు.
పూజారులను ఎంత గౌరవిస్తారో అదే స్థాయిలో ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలను కూడా గౌరవిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఇమామ్, మౌజంల గురించి ఆలోచించలేదన్నారు. తొలిసారిగా ఇమామ్, మౌజంలకు రూ. వెయ్యి జీవనభృతి అందించడం గొప్ప విషయమని కితాబిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సీఎం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.