అద్దె గర్భానికి చెక్ పెట్టే కీలక బిల్లుకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. సరోగసీ కేసులపై నిఘా కోసం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటుచేయనున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇక నుంచీ ఎవరూ అద్దె గర్భానికి డబ్బు చెల్లించకూడదు. అంటే ఎవరూ తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే అవకాశం ఉండదు. దత్తత తీసుకున్న పిల్లలు ఉన్న వారికి అద్దె గర్భానికి అనుమతించేది లేదని సుష్మా స్వరాజ్ తెలిపింది.వీరితో భార్య భర్తలు విడిపోయిన వారికి, స్వలింగ సంపర్కులు, సహజీవనం చేస్తున్న వారికి సరోగసికి అనుమతించమని తెలిపారు.
అంతేకాదు వంధ్యత్వం ఉందని నిరూపితమైతేనే సరోగసీకి అనుమతి ఇస్తారు. అప్పుడు కూడా ఆ తల్లి వైద్య ఖర్చులకు మాత్రమే డబ్బు చెల్లించాలి తప్ప.. గర్భాన్ని మోసినందుకు ఏ పరిహారం ఇవ్వకూడదని ఈ కొత్త బిల్లు చెబుతోంది. ఇక సమీప బంధువులు మాత్రమే సరొగేట్స్‌గా ఉండాలన్న నిబంధన కూడా ఉంది. పౌరసత్వానికి సమస్యలు వస్తాయన్న విదేశాంగ శాఖ ఆందోళన నేపథ్యంలో ఈ ప్రక్రియలో విదేశీయులు ఉండకూడదన్న నిబంధననూ బిల్లులో చేర్చారు. కేవలం భారతీయ జంటలు, అది కూడా పెళ్లి చేసుకొని ఐదేళ్లు దాటితేనే సరోగసీకి అనుమతి ఇస్తారు. ఈ ముసాయిదా బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
బాలీవుడ్ లో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్.. టాలీవుడ్ లో మంచు లక్ష్మి లాంటి వాళ్లు ఇలాగే ఓ బిడ్డను పొందారు. అమీర్ ఖాన్ ఈ పద్దతిలో తొలిసారి ఓ బిడ్దను పొంది.. ఇండియాలో టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయాడు.