భారత్, పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేపట్టిన సర్జికల్ దాడుల వివరాలను భారత సైన్యం అధికారికంగా ఆయా రాజకీయ పార్టీల సీనియర్లకు, అగ్ర నాయకులకు, ముఖ్యమంత్రులకు చాలా స్పష్టంగా వివరించింది. అర్థరాత్రి 12.30గంటల ప్రాంతంలో మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ తెల్లవారు జామున 4.30గంటల ప్రాంతంలో ముగిసినట్లు వివరించింది. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసింది. మరో ఏడుగురు బందీ అయినట్లు సమాచారం.
అయితే, ఈ దాడిలో భారత్ సైనికుల్లో ఏ ఒక్కరూ గాయపడలేదు. భారత ఆర్మీ ప్రత్యేక దళం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30గంటల ప్రాంతంలో దాడిని ప్రారంభించి 4.30గంటల ప్రాంతంలో ముగించింది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని పాఠశాలలను అధికారులు మూసివేశారు. గుజరాత్ నుంచి జమ్ము వరకు సరిహద్దు భద్రతా బలగాలు హైఅలర్ట్‌ను ప్రకటించాయి. దీంతో పాటు సరిహద్దులోని పరిస్థితుల గురించి ఆయా ప్రాంతాల సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడులను అభినందిస్తూ దేశాలకు అతీతంగా భారత్‌కు మద్దతు లభిస్తోంది. తామంతా సైన్యం వెంటే ఉన్నామంటూ ప్రజలందరు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది.తాజా పరిస్థితిని వివరించింది. సర్జికల్ ఆపరేషన్ పై అఖిలపక్షం సంతృప్తి వ్యక్తి చేసింది. సైన్యం చర్యలను అభినందిస్తున్నట్లు వివిధ పార్టీల నేతలు తెలిపారు.
ప్రధాని మోడీ చేపట్టిన ఈ నిర్ణయాత్మక చర్యను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కొనియాడారు. భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడుల గురించి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అసిఫ్ ఖవాజా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు.
భారత సైన్యం ఆపరేషన్ కు ఎలా కదిలిందంటే..
()తొలిసారి దాటి పాకిస్థాన్ భూభాగం వైపు 500 మీటర్ల నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ముందుకు కదిలాయి.
()వివిధ సెక్టార్లలోని ఎనిమిది స్థావరాలపై దాడి చేశాయి.
()ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు భారత ఆర్మీ పారాకమాండోస్, హెలికాప్టర్లను ఉపయోగించారు. బలగాలను ఈ హెలికాప్టర్ల ద్వారా అనుమానిత ప్రాంతంలోకి దించారు.
()ఒక్కసారిగా అనూహ్యంగా భారత్ సైన్యం నిర్వహించిన సర్జికల్ ఆపరేషన్ లో ఉగ్రవాద శిబిరాలకు భారీ నష్టం చోటుచేసుకుంది.
()దాదాపు 38మంది ఉగ్రవాదులు హతమై మరికొందరు బందీగా తీసుకున్నారు
()ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యర్ధుల నుంచి లభించిన ఆయుధాలు అన్నీ కూడా పాక్ కు చెందినవని గుర్తించారు.
()ఈ దాడిలో హతమైనవారు పాక్ ప్రాంతానికి చెందినవారు, పాక్ ఆక్రమితి కశ్మీర్ కు చెందినవారని తెలిసింది.
()ఈ దాడిలో కేవలం ఉగ్రవాదులే కాకుండా వారికి దారి చూపించేవారు, శిబిరాల నిర్వాహకులు కూడా ఉండటంతో ఎక్కువమంది గాయపడ్డారు.
()ఈ దాడిలో హతమైన వారంతా జమ్మూకశ్మీర్ తోపాటు ఇతర మెట్రో నగరాలపై దాడులు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్మీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఇలాంటి చర్యలు అవసరం’- వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి
‘ఈ నిర్ణయంపై దేశం యావత్తూ భారత సైన్యానికి అండగా నిలుస్తుంది.. భారత్ మాతాకీ జై’- అరవింద్ కేజ్రీవాల్,ఢిల్లీ ముఖ్యమంత్రి
‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిబద్ధతకు ఈ నిర్ణయమే నిదర్శనం’- రవిశంకర్ ప్రసాద్, కేంద్రమంత్రి
‘ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు నిర్ణయం తీసుకున్న భారత సైన్యానికి అభినందనలు’- పియూష్గోయల్, కేంద్రమంత్రి
‘దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరులో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. లక్షిత దాడుల ద్వారా ఉగ్రవాదంపై యావత్ దేశ నిర్ణయాన్ని తెలియజేసినట్లైంది’- సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు
‘ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులు చేసిన భారత సైన్యానికి అభినందనలు. ఈ దాడులతో కొత్త భారతావని ఉదయించింది. క్రూర ఉగ్రవాద చర్యలను దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చెప్పడానికి ఇదే సరైన సంకేతం’-అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
‘ఉగ్ర స్థావరాలపై కేంద్రాలపై దాడులు జరపాలన్న కేంద్ర ప్రభుత్వం, సైన్యం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం’- కేటీఆర్, తెలంగాణ మంత్రి