ఒకరు మ్యూజిక్ మ్యాస్ట్రో..మరోకరు తెలుగు భాష మాధుర్యం తెలిసిన సంగీత దర్శకులు. ఎవరికి వారే సాటి. సాంప్రదాయ, పాశ్చాత్య బాణీలను రంగరించి అటు యువతరాన్ని, నవతరాన్ని కట్టి పడేయగల శక్తి ఒకరి సొత్తైతే… మరొకరు తెలుగు సంగీత దర్శకుల్లో తమదైన ముద్రవేసుకున్న వారు. వీరిద్దరి కలిసి ఒకే సినిమాలో స్వర, సంగీత సమకూరిస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులకు కన్నులపండగే.
ఇంతకీ వారెవరనుకుంటున్నారా….ఒకరు ఆస్కార్డ్ అవార్డు విన్నర్ కాగా మరొకరు బాహుబలితో సాహో అనిపించుకున్న కీరవాణి. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో జోడికట్టారు. ఏఆర్ రెహమాన్ స్వర సారధ్యంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఓ పాట పాడారు. తాను రెహమాన్ కోసం ఏ సినిమాలో పాట పాడిని విషయాన్ని తెలుపకపోయినా.. స్వదేశ్ సినిమాలో ఏ జో దేశ్ హై తేరా లాంటి అద్భుతమైన మెలోడీని పాడినట్టుగా తన ట్విట్టర్ లో వెల్లడించారు కీరవాణి.
సంగీత దర్శకులు తాము సంగీతమందించిన చిత్రాల్లో పాటలు పాడినా.. ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లో పాటలు పాడటం చాలా అరుదు. ముఖ్యంగా సంగీత దర్శకులుగా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఇతర సంగీత దర్శకుల కోసం సమయమివ్వటం మరింత అరుదు. అలాంటి అరుదైన కలయిక త్వరలో సంగీత అభిమానులను అలరించనుంది. ఆ పాట ఎలా ఉండనుందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.