హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తే మాట దాటి వేస్తారు. కానీ కొంతమంది మాత్రం సందర్భమొచ్చినప్పుడు ఓపెన్ గానే మాట్లాడేస్తారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకచోప్రా కూడా చేరిపోయింది. ఇక..సినిమా ఇండస్టీలో హీరోయిన్లు ఎలాంటి వేధింపులను ఫేస్ చేస్తారో రోజురోజుకూ బయటపడుతూనే ఉంది. అయితే ఇలాంటి వేధింపులను తాను కూడా ఎదుర్కొన్నానంటోంది ప్రియాంకచోప్రా.
‘లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లోనూ మామూలే.. సినీ ప్రపంచం అంటే గ్లామరస్ ఇండస్ట్రీ కదా.. ఇక్కడ ఇంకాస్త ఎక్కువ వుంటాయంతే. నేనూ వాటికి మినహాయింపు కాదు. ఓ దశలో తీవ్రమైన లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నాను. నాలా చాలామంది ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటూనే వున్నారు.. పురుషాధిక్యమే అన్ని అనర్ధాలకీ కారణం..’ అని ప్రియాంకా చోప్రా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది.’
అంతేకాకుండా…’మహిళలపై లైంగిక వేధింపులు అనేవి పురుషులు తమ బలాన్ని ప్రదర్శించేందుకు చేస్తున్న ఓవరాక్షన్ వల్లే జరుగుతున్నాయని, ఇక్కడ పవర్ ముఖ్యం, ఆ పవర్ మహిళలకూ దక్కితే లైంగిక వేధింపులు తగ్గుతాయని చెప్పుకొచ్చింది. వస్త్రధారణ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయన్న ప్రియాంకా చోప్రా, స్త్రీ – పురుషులిద్దరూ సమానమేనన్నది మాటలకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే, ప్రియాంకా చోప్రా వ్యాఖ్యల పట్ల బాలీవుడ్‌లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ‘సినీ పరిశ్రమలో వుంటూ, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ..’ అన్న మాట ప్రియాంకా చోప్రా అనడం హాస్యాస్పదమనీ, సమాజంలో సినీ పరిశ్రమ కూడా ఓ భాగమేననీ, అన్ని చోట్లా వున్నట్లే ఇక్కడా ఒకటీ, అరా సంఘటనలు జరిగినంతమాత్రాన సినీ పరిశ్రమపై బురద జల్లడమేంటని ప్రియాంకపై మండిపడ్తున్నారు.