ఇటీవల బెంగుళూరులో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై ప్రభుత్వం ఎందుకు కఠినంగా స్పందిండం లేదని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రధాని నరేంద్రమోదీ తనకన్నా పెద్ద నటుడు అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు గౌరీ లంకేష్ హత్యపై మోదీ స్పందించకపోతే తన అవార్డులని సైతం వెనక్కి తిరిగిచ్చేయడానికి కూడా వెనుకాడబోనని ఆయన స్పష్టంచేసినట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి.
ఆ తర్వాత తాను ఎందుకు తన అవార్డులని వెనక్కి ఇస్తాను అని ప్రకాష్ రాజ్ ప్రకటించినప్పటికీ.. మోదీపై అతడు వ్యక్తంచేసిన అసంతృప్తి మాత్రం సోషల్ మీడియాలో అనేక చర్చలకి దారితీసింది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారా ? ఆ ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారా అనే అంశాలపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ చర్చించుకున్నారు.
ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన ప్రకాష్ రాజ్.. తనకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని అన్నారు. ఒకవేళ తనకి రాజకీయాల్లోకి రావాలని అనిపిస్తే, నేరుగానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాను కానీ డొంక తిరుగుడు స్టేట్ మెంట్స్ ఇవ్వనని స్పష్టంచేశారు ప్రకాష్ రాజ్.