తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. సంగెం- గీసుగొండ మండలాల సరిహద్దులో 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పరిశ్రమ పనులకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సంగెం మండలం చింతలపెల్లి సరిహద్దులో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమ పార్కుతో పాటుగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట ఆర్వోబీ, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ టెక్స్టైల్ పార్కు దగ్గరనే సాయంత్రం నాలుగు గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రోజు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. పరిశ్రమలో పెట్టుబడులకు 22 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హరిత కాకతీయ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సీతారం నాయక్, పసునూరి రవీందర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నరేందర్, టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, రెడ్యానాయక్ పాల్గొన్నారు.