అగ్ర తారలు నాగార్జున, సమంత తొలిసారి ఓ హారర్ కామెడీ కథలో నటించడం.. విజయవంతమైన `రాజుగారి గది`ని సిరీస్‌గా మార్చిన చిత్రం కావడం.. పెళ్లి తర్వాత విడుదలవుతున్న సమంత తొలి చిత్రం కూడా ఇదే అవుతుండడంతో `రాజుగారి గది2`పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని, అంచనాల్ని మరింతగా పెంచాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందా? ఆత్మగా సమంత, మెంటలిస్ట్‌గా నాగార్జున చేసిన సందడి ఎలా ఉంది? దసరా హంగామా తర్వాత వస్తున్నఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం…
కథ:
అశ్విన్(అశ్విన్), కిశోర్(వెన్నెల కిశోర్), ప్రవీణ్(ప్రవీణ్) మంచి స్నేహితులు. ఇళ్లల్లో ఇబ్బందులున్నా, కష్టాలకు ఓర్చి రాజుగారి రిసార్ట్‌ను కొనుగోలు చేస్తారు. కానీ రిసార్ట్‌లో ఓ దెయ్యం వారిని భయపెడుతుంటుంది. దాంతో ఆ ముగ్గురూ చర్చి ఫాదర్ (నరేశ్)ని సంప్రదిస్తారు. ఆయన సలహాతో మెంటలిస్ట్ రుద్ర(నాగార్జున) రంగంలోకి దిగుతాడు. కళ్లలో చూస్తూ మనసులో ఏముందో చెప్పగల సమర్థుడు రుద్ర. పోలీసులు కూడా పలు కేసుల్లో ఆయన సహకారం తీసుకుంటారు. ఫాదర్ కోరిక మేరకు రిసార్ట్‌లోకి అడుగుపెట్టిన రుద్రకు సుహానిస(సీరత్ కపూర్)పై అనుమానం వస్తుంది. ఆ తర్వాత అమృత(సమంత) అనే అమ్మాయి ఆత్మ ప్రతీకారం కోరుకుంటుందన్న విషయం తెలుసుకుంటాడు.ఇంతకీ అమృత ఎవరు? రాజుగారి రిసార్ట్‌కి ఆమెకి సంబంధం ఏంటి? ఆమె ప్రతీకారం ఎవరిపైన? అమృతకి సుహానిసకి బంధం ఏమైనా ఉందా అన్న విషయాలు తెరపై చూడాలి.
విశ్లేషణ: సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, సినిమా కథంతా రెండు ప్రధాన పాత్రల మధ్య ఎక్కువగా నడుస్తుంది. అందులో ఒకటి అక్కినేని నాగార్జున కాగా, రెండ పాత్ర సమంత. నాగార్జున హీరోయిజమ్‌ను బేస్ చేసుకుని కథను నడపకుండా, కథానుగుణంగా క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. మెంటలిస్ట్ రుద్ర పాత్రలో నాగార్జున నటన ఆసాంతం అలరించారు. క్లైమాక్స్‌లో నాగార్జున, సమంతల మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయి.
ఆడపిల్లల గొప్పతం గురించి చెప్పడమే కాక, సమాజంలో చెడు ఎదురైనప్పుడు కూడా ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పే సందర్భాల్లో నాగ్ నటన మెప్పించింది. ఇక సమంత క్యారెక్టర్ సెకండాఫ్‌లో ఎక్కువగా కనపడింది. ఉన్నంత వరకు ఎమోషనల్ క్యారెక్టర్‌ను సమంత బాగా పుల్ చేసింది. సమంత తండ్రి పాత్రలో రావు రమేష్‌గారు చక్కగా నటించారు. ఇక అభినయ, నందు, వెన్నెలకిషోర్, అశ్విన్, ప్రవీణ్‌లు పాత్రలకు తగ్గట్టు న్యాయం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..ముందుగా అభినందించాల్సింది దర్శకుడు ఓంకార్‌ను. మలయాళ సినిమాలో మెయిన్ పాయింట్‌ను తీసుకుని దాన్ని తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ చేస్తూ తెరకెక్కించిన తీరుకు అబినందించాలి.
ముఖ్యంగా హీరో క్యారెక్టర్ అంటే మెంటలిస్ట్ పాత్రలో నటించిన నాగార్జున పాత్రను చక్కగా ఎలివేట్ చేసేలా సన్నివేశాలు తయారు చేశాడు. ఫస్టాఫ్‌లో హీరో క్రైమ్ కేసును పోలీసుల సపోర్ట్‌తో సాల్వ్ చేసే సన్నివేశం సహా, క్లైమాక్స్‌లో కూడా హీరో, అసలు వ్యక్తిని పట్టుకునే సన్నివేశం కూడా బావుంటుంది. ఏదో ప్రేక్షకుడిని భయపెట్టాలంటే దెయ్యాన్ని చూపించాలనే తీరులో కాకుండా, కాన్సెప్ట్ ప్రకారం ఆత్మను చూపించిన విధానం బావుంది. దివాకరన్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్ రిచ్‌గా కనపడింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖ్యంగా ఆత్మను చూపించే సందర్భంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. మనిషికి మానవత్వాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది..ప్రేమను పరిచయం చేయాల్సి వస్తుంది..ఆ దేవుడుని బోనులో నిలబెట్టే అవకాశం వచ్చింది. వెళ్లి గట్టిగా నిలదీయ్…అనే క్లైమాక్స్ డైలాగ్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి.
నిర్మాణ విలువలు బావున్నాయి. రాజుగారి గది సినిమాకు సిరీస్‌గా సినిమా రూపొందింది కదా.. అదే స్థాయి కామెడీని మాత్రం ప్రేక్షకుడు ఆశించడం తప్పే అవుతుంది. కామెడీ రేంజ్ ఉంది. కానీ లాజికల్‌గా ఉంది. నాగార్జున క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కానంత వరకు సినిమా సాదా సీదాగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నాగార్జున, సమంత సహా నటీనటుల పెర్ఫామెన్స్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
బలమైన ఎమోషన్స్
సెకండాఫ్
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ కథలో టెంపో కనపడదు.
విడుదల తేదీ : 13/10/2017
రేటింగ్ :3.25/5
నటీనటులు : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్
సంగీతం : ఎస్.తమన్
నిర్మాత : ప్రసాద్ వి పొట్లూరి
దర్శకత్వం : ఓంకార్