అస్సాం గౌహతి వేదికగా భారత్-ఆసీస్ మధ్య టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం హోటల్‌కు వెళుతున్న ఆసీస్ క్రికెటర్ల బస్సుపై ఇద్దరు దుండగులు దాడి చేశారు.ఈ ఘటనలో బస్సు అద్దం ధ్వంసం కాగా దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆసీస్ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కోహ్లీ సేన పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు ఈ దాడికి పాల్పడి ఉంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. బస్సు అద్దం పగిలిన దృశ్యాన్ని ఆసీస్ ఆటగాడు అరోన్ ఫించ్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
‘మైదానం నుంచి హోటల్‌కు వెళ్లే క్రమంలో ఎవరో మేము ప్రయాణిస్తున్న బస్సుపై రాయి విసిరారు. ఈ దాడిలో అద్దం పగిలింది. కొంచెం భయం కూడా వేసింది అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. వెంటనే అప్పమత్తమైన అధికారులు మాకు భద్రత పెంచారు. విచారణ ప్రారంభించారు అని తెలిపారు.
రెండు నెలల వ్యవధిలో ఆసీస్ క్రికెటర్ల బస్సుపై దాడి చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరులో బంగ్లాదేశ్‌లో పర్యటన సమయంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు ఆ జట్టు ఆటగాళ్లు ప్రయాణిస్తోన్న బస్సుపై రాయి విసిరారు. ఈ ఘటనలోనూ ఎవరూ గాయపడలేదు.
Pretty scary having a rock thrown through the team bus window on the way back to the hotel!! pic.twitter.com/LBBrksaDXI
— Aaron Finch (@AaronFinch5) October 10, 2017