దర్శకుడు ఆర్జీవీ స్టైలే వేరు. ఆయన ఏం చేసినా అది వార్త కావాల్సిందే. తాజా రాజకీయాలపై, సినీ హీరోలు, వారి సినిమాలపై సెటైర్లు విసరాలన్న వర్మకే చెల్లింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తానని ప్రకటించిన వర్మ…ఆయన జీవితంలోని ఎవరికి తెలియని బయటపెడతానని సంచలనం సృష్టించాడు.
అన్నట్లుగానే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి అందరిని విస్మయానికి గురిచేసిన వర్మ తాజాగా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన ఆయన నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని… ఎన్టీఆర్ జీవితం మహాభారతం వంటిదని వర్మ అన్నారు. అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ లైఫ్‌లోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరవాత రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు, ఆయన ఎదుర్కొన్న అవంతరాలు, మానసిక క్షోభ తదితర అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు.
ఒక అడుగు ఓ వ్యక్తి హృదయంలో ప్రేమను పుట్టిస్తే, అదే అడుగు వందల మందికి ద్వేషాన్ని కలిగించింది. ఆ ఒక్క అడుగు ఆ వ్యక్తిలో కలిగించిన పునరుత్తేజం, మళ్లీ లక్షల మంది ప్రేమించే విధంగా చేసింది” ఇదే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథ అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్రేమ కథతో పాటు ద్వేషం, అసూయ, పదవీకాంక్ష, వెన్నుపోటు సహా బంధువుల మధ్య నమ్మలేని అంతర్గత విభేదాలు, వివాదాలు ఉంటాయని వెల్లడించారు.