తమ కుమారుడి పెళ్లికి రావాలంటూ పరిటాల సునీత స్వయంగా కేసీఆర్ ను ఆహ్వానించగా, పరిటాల రవితో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్న ఆయన, అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే అనంతపురం జిల్లా వెంకటాపురంలో వైభవంగా జరుగుతున్న పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ప్రొటోకాల్ అధికారులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు.
ఉదయం 11.30 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరిన ఆయన, 12.20 గంటల సమయంలో పుట్టపర్తి చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన హెలికాప్టర్ ఎక్కి వెంకటాపురం బయలుదేరారు. కాగా, ప్రస్తుతం శ్రీరామ్ వివాహ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. సింగనమల నియోజకవర్గం నార్పాల మండలం ఏబీఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత ఆళం వెంకటరమణ, సుశీలమ్మ కుమార్తె ఆళం జ్ఞానవేణితో శ్రీరామ్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, హీరోలు నందమూరి బాలకృష్ణ, తారక్ రామ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.