కథానాయికలకు గ్లామర్ పాత్రలు రావడం పెద్ద విషయం కాదు. డీగ్లామర్ పాత్రలు రావడమే కష్టం అంటోంది ఆలియా భట్. కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలూ ఆలియా తలుపు తడుతున్నాయి. ‘‘గ్లామర్ పాత్రలు అందరికీ వస్తాయి. నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రలు కొంత మందికే వస్తాయి. కథలో పాత్ర సిద్ధమైన వెంటనే మన వద్దకు రాదు. మధ్యలో ఎంతో మంది వద్దకు వెళుతుంది. కనీసం ఓ 20 మంది ఆ పాత్ర గురించి విన్నాకా చివరకు ఆ పాత్ర ఎవరికి రాసిపెట్టుందో వాళ్లకి దక్కుతుంది.
ఎందుకంటే నా విషయంలో అది జరిగింది. ‘ఉడ్తా పంజాబ్’ నటిగా నాకు ఎంతో పేరు తెచ్చిన చిత్రం. కానీ అందులోని పాత్ర వెంటనే నన్ను వెతుక్కొంటూ రాలేదు. నాకంటే ముందు చాలామంది కథానాయికల వద్దకు ఆ కథ వెళ్లింది. నాకు పేరు రావాలని ఉంది కాబట్టి చివరకు నేను నటించానంతే’’అని చెపింది ఆలియా.
ఆలియా తాజా చిత్రం ‘రాజీ’ చిత్రీకరణ పూర్తికావచ్చింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆలియా సిద్ధమవుతోంది. ‘‘రాజీ’ పూర్తయింది. అయాన్సార్ సినిమా గురించి ఇప్పుడిప్పుడే ఆలోచించడం మొదలు పెట్టను. అంటే సాధారణంగా అతిగా ఆలోచించడం నాకు నచ్చదు. ఒక సినిమా పూర్తయ్యాకే రెండో సినిమాపై దృష్టిపెడతాను. ఒకేసారి అన్ని సినిమాల గురించి ఆలోచించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు’’ అంటోంది ఆలియా భట్.