తమిళ రాజకీయాలపై కమల్ కొద్ది కాలంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ అన్నాడీఎంకేతోపాటు ఇతర రాజకీయ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాదు ఎన్డీఏ సర్కార్ ముఖ్యంగా బీజేపీపై సైతం అస్త్రాలు ఎక్కుపెట్టిన కమల్ తాను కాషాయం ధరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.
కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కమల్ …అవసరమైతే బీజేపీతో దోస్తీకి సిద్దమేనని ప్రకటించాడు. అంతేగాదు పార్టీ పెట్టిన తర్వాత నటించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు.పాలకులు, ప్రజా సంక్షేమం సక్రమంగా సాగడం లేదని, ఆ కోపంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వెల్లడించాడు.
అసలు రాజకీయాల్లో అంటరానివారు అంటూ ఎవరూ ఉండరని తెలిపారు. పేదలకు దగ్గర కావడమే తన లక్ష్యమని, సంక్షేమాన్ని అట్టడుగునున్న వ్యక్తికి కూడా అందించాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. ఓటు వేసేందుకు రూ. 5 వేలు తీసుకోవడంతోనే లంచగొండితనం మొదలవుతుందని, ఓటును డబ్బిచ్చి కొనుగోలు చేసే నేత, అభివృద్ధిని గురించి ఆలోచించడన్నది తన అభిప్రాయమని తెలిపారు.
ప్రజలకు తాను వడ్డించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, ప్రస్తుతానికి ఇంకా వంటపనిలోనే ఉన్నానని, అది పూర్తయిన తరువాత ప్రజలకు రుచికరమైన భోజనం పెడతానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, చాలా త్వరగా మీడియా తన అభిప్రాయాలను చెబుతోందని, ఆ విషయం ప్రజలకే వదిలేస్తున్నానని కమల్ అన్నారు.