సర్జికల్ స్ట్రయిక్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. జమ్మూలోని యూరీ సైనిక స్ధావరంపై పాక్ ముష్కరులు విరుచుకపడి 19 మంది సైన్యాన్ని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 11 రోజుల తర్వాత సెప్టెంబర్ 29న భారత ఆర్మీ పగ తీర్చుకుంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తీవ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. రాత్రి 12 గంటలకు సరిహద్దు నియంత్రణ రేఖ పొడవునా భారత సైన్యం 3 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయింది. ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక పారా కమాండర్లు హెలిక్యాప్టర్ ద్వారా సర్జికల్ దాడులు జరిపారు. ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 8 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. 30 నుంచి 40 మంది టెర్రరిస్టులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్ సరిహద్దులో తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నన్న పాకిస్తాన్‌కు తగిన రీతిలో భారత్ ఆర్మీ దెబ్బకు దెబ్బ తీసింది.ఈ నేపథ్యంలో భారత్ నిర్వహించిన సర్జికల్ స్టయిక్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మోడీ సర్కార్‌కు మంచి ఇమేజ్‌ని తెచ్చిన సర్జికల్ స్టయిక్స్ నేపథ్యంగా త్వరలో సినిమా తెరకెక్కనుంది.
యూ టీవీ ఫిల్మ్స్ సర్జికల్ స్టయిక్స్ ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది.ఈ సినిమాకు యూరీ టైటిల్‌ని ఖరారు చేసింది. 2018లో సినిమా ప్రారంభవుతుందని అదే సంవత్సరం సెప్టెంబర్ 2018న విడుదల చేయనున్నట్లు యూ టీవీ ఫిల్మ్స్ తెలిపింది.