ప్రధాని నరేంద్ర మోడీ నేడు 67 ఏట అడుగుపెడుతున్నారు. గత రాత్రే అహ్మదాబాద్ చేరుకున్న మోడీ, తన తల్లి హీరాబా ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బీజేపీ ‘సేవా దివస్’ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. మోడీ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరిపేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యూపీలో పెద్దఎత్తున వేడుకలు సాగనున్నాయి.
నరేంద్ర మోడీ కలలను వాస్తవం చేసే గొప్ప సామర్ధ్యం కలిగిన మహా స్వాప్నికుడు. గుజరాత్ పునరుత్తేజం, మార్పిడి, అదే సమయంలో మాతృభూమి భారత్ అభివృద్ధి చెందిన, శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించడం ఆయన అత్యున్నత స్వప్నం. ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ పరిశోధన, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ది ఆయన భారత్ కోసం కనే కల. కఠిన లక్ష్యాల సాధనకు, కఠిన క్రమశిక్షణకు మారుపేరైనా మోడీ.. నేడు 67 ఏట అడుగుపెడుతున్న సంధర్బంగా మోడీకి సంబంధించిన విషయాలు కొన్ని చూద్దాం..
నరేంద్ర మోడీకి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు లాప్‌టాప్ను ఉంచు కుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. ఆయన సోదరులు, సోదరీమణుల జీవితం ఎవరిది వారిదే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోడీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం.
1950 సెప్టెంబరు 17న జన్మించిన నరేంద్ర మోడీ.. చిన్నప్పటి నుండే చురుగ్గా ఉండేవారు. తండ్రి ఒక చిన్న టీ కొట్టు నడిపేవారు. తల్లి చిన్న గానుగ నడిపేది. ఆరో ఏటనుండి ఉదయం తండ్రికి సహాయం చేసి పాఠశాలకు వెళ్ళేవాడు మోడీ. ఎనిమిదవ ఏట రాష్ట్రీయ స్వాయంసేవక్ సంఘములో చేరారు. ఉదయం తండ్రికి టీ కొట్టు నడపడంలో సహాయం చేయడం, స్కూలికి వెళ్ళడం సాయంత్రం ఆర్.యస్.యస్ కి వెళ్ళడం మోడీ దినచర్యగా ఉండేది.
18 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుంటానని ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన మోడీ.. రెండేళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చి అహ్మదాబాదులో ఆయన మామయ్య టీ కొట్టు లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఒక టీబండి ద్వారా టీ అమ్మడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాక ఆయన రాష్ట్ర కార్యాలయములో ఒక పనివాడిగా చేరారు. కార్యాలయములో అందరికి ఉదయం టీ, టిఫిన్ తయారు చెయ్యడం తర్వాత కార్యాలయము శుభ్రం చెయ్యడం ఆయన పనిగా ఉండేది.
1971 లో మోడి ఆర్.యస్.యస్ శిక్షణ శిబిరానికి నెల రోజులు వెళ్లారు. శిక్షణ తరువాత ఆయనను ఆర్.యస్.యస్ వాళ్ళు అఖిల భారత విధ్యార్ధి పరిషద్ గుజరాత్ శాఖ వ్యవహారమును చూడమని నియమించారు. 1974 లో మోడి నవనిర్మాన్ ఆందోళన లో పాల్గొన్నారు. 1975లో కేంద్ర పభుత్వము అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆర్.యస్.యస్ వాళ్ళని జైలుకి పంపించిది. ఆ సమయంలో మోడీ పోలీసులకు దొరకకుండా రహస్యంగా పని చేశారు. ఆ తరువాత మోడీ పలు సందర్భాల్లో, ముఖ్యంగా 1974 నవనిర్మాణ్ అవినీతి వ్యతిరేక ఆందోళనలో, 19 నెలల అత్యవసర పరిస్థితిలో (జనవరి 1977 జూన్ 1975) భారత పౌరుల ప్రాథమిక హక్కులను గొంతునులిమినప్పుడు సాగిన పోరాటంలో ఆయన కీలకమైన పాత్రను పోషించారు.
1988, 1995 మధ్య గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడంలో నరేంద్ర మోడీ చేసిన కృషి క్షేత్రస్థాయిలో పనిచేసింది. ఆ సమయంలోనే బీజేపీ అధీష్టానాన్ని ఆకర్షించగలిగారు. నరేంద్ర మోడీని ప్రతిభావంతమైన వ్యూహాకర్తగా పార్టీ గుర్తించింది. 1995లో నరేంద్ర మోడీని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించి, ఆయనకు భారతదేశంలోని ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. ఒక యువ నాయకుడుగా నరేంద్ర మోడీకి దక్కిన అరుదైన గౌరవం ఇది. 1998లో ఆయనకు జాతీయ కార్యదర్శి (ఆర్గనైజేషన్) గా పదోన్నతి లభించింది. ఈ పదవిలో ఈయన అక్టోబర్ 2001 వరకు ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు.
మోడీ పాలనా సమర్థత, స్పష్టమైన దృక్పథం, వ్యక్తిత్వ పరిపూర్ణత లకు ఆయన నైపుణ్యం తోడై 2002 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టాయి. 182 అసెంబ్లీ స్దానాలున్న గుజరాత్ శాసనసభలో 128 స్దానాలను నరేంద్రమోడీ కైవసం చేసుకున్నారు. ఇదే విజయ పరంపర 2007 ఎన్నికల్లో పునరావృతమై మళ్లీ గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
2002, 2007 ఎన్నికల్లో(117 సీట్లు) గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన నరేంద్ర మోడీ, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(115 సీట్లు) తన జోరును కొనసాగించారు. 2012లో వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగాప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. ఎన్ని విమర్శలు వచ్చినా తనపని తాను చేసుకుపోవడమే మోడీ స్టైల్.. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోడీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే.