ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందించి ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది రిలయన్స్ జియో. దాంతో జియో వేగానికి టెలికాం కంపెనీలు ఒకొక్కటిగా దిగొస్తున్న విషయం తెలిసిందే.
జియోని దెబ్బకొట్టే విధంగా ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో లీడింగ్ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది.
ఎయిర్టెల్ టీవీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులకు ఉచితంగా 60 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు పేర్కొంది. నెలకు 10 జీబీ చొప్పున ఆరు నెలలపాటు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే ఎయిర్టెల్ నెలకు 10 జీబీ చొప్పున మూడు నెలల పాటు 30 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు దానిని 60జీబీకి పెంచింది.
ఎయిర్టెల్ టీవీ యాప్ ద్వారా వినియోగదారులు లైవ్ టీవీతోపాటు హుక్, సోనీ లివ్, యూట్యూబ్, డైలీమోషన్ వీడియోలను వీక్షించవచ్చు. అయితే ఎయిర్టెల్ టీవీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఉచిత డేటా లభిస్తుందని ఎయిర్టెల్ తెలిపింది.