తమిళ రాజకీయాలపై కమల్ కొద్ది కాలంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ అన్నాడీఎంకేతోపాటు ఇతర రాజకీయ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాదు ఎన్డీఏ సర్కార్ ముఖ్యంగా బీజేపీపై సైతం అస్త్రాలు ఎక్కుపెట్టిన కమల్ తాను కాషాయం ధరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. ఈ నేపథ్యంలో కమల్…లెఫ్ట్ వైపు మొగ్గు చూపుతున్నాడా లేదా డీఎంకే పార్టీలో చేరుతారా అన్న సందిగ్దంలో అందరిలో నెలకొంది. కానీ ఆ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించి తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు.
మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కమల్ రజనీ రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాల పరంగానే మా ఇద్దరి మధ్య పోటీ ఉంది. కీలక సమస్యలపై గతంలో మేం చర్చించుకున్న దాఖలాలు ఉన్నాయని గతాన్ని గుర్తుచేశారు. రజనీ మా పార్టీలోకి వస్తానంటే రెడ్ కార్పెట్ పరుస్తానని…ఆయనతో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తా అని చెప్పుకొచ్చారు.
అన్నాడీఎంకే పార్టీ, ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శశికళను పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి అన్నాడీఎంకే తొలగించిన విషయమై మాట్లాడుతూ.. ఇది మంచి నిర్ణయం అన్నారు. ఆమెను తప్పించడంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పు వస్తుందన్న నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు.