కమల్ హాసన్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారా? గత కొద్ది రోజులుగా తమిళనాడు పొలిటికల్ వార్ నడుస్తున్న నేపథ్యంలో కమల్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నాడా? ఎప్పుడు రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నారు? తమిళనాట మరో కొత్త పార్టీ అవతరించనుందా? సొంత కుంపటి ద్వారానే ఆయన రాజకీయాల్లోకి రానున్నారా? ఈ ప్రశ్నలకు కమల్ ఎస్ అంటున్నాడు. సొంత పార్టీ పెట్టబోతున్నానని ఓ ఇంటర్వ్యూలో కమల్ స్పష్టం చేశారు. అయితే తనని ప్రజలు బలవంతం చేయడం వల్లే పార్టీ పెట్టబోతున్నానని.. ఇష్టంతో కాదని పేర్కొన్నారు.
త్వరలోనే సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నానని.. ఇది తన ఇష్టప్రకారంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. తనకున్న విధానాలతో ఉన్న పార్టీలు తమిళనాడులో ఏమున్నాయన్నారు. అనంతరం శశికళను పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి అన్నాడీఎంకే తొలగించిన విషయమై మాట్లాడుతూ.. ఇది మంచి నిర్ణయం అన్నారు. ఆమెను తప్పించడంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పు వస్తుందన్న నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. అన్నీ కుదిరితే ఈ నెలాఖరులోనే కొత్త పార్టీకి కమల్ శ్రీకారం చట్టవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. విజయదశమి పర్వదినం రోజున, లేదా గాంధీ జయంతి రోజున ముహూర్తం ఖరారు చేసినట్లుగా సమాచారం.
తమిళ రాజకీయాలపై కమల్ కొద్ది కాలంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ అన్నాడీఎంకేతోపాటు ఇతర రాజకీయ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. డీఎంకే ఇంటి పత్రిక మురసోలి 75ఏళ్ల వార్షికోత్సవంలోనూ పాల్గొన్నారు. జీఎస్టీ లాంటి అంశాలతోపాటు ఇటీవల నీట్ కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత మృతిపై తనదైన స్టైల్లో స్పందించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ తర్వాత వామపక్ష పార్టీ నాయకులే అసలైన హీరోలంటూ కమల్ ప్రశంసించారు. కాగా, రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఆయన సన్నిహితులు కొద్దిరోజులుగా చెబుతున్నారు. ఇప్పుడు కమల్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా.. లేదా.. అన్నది మరోసారి ప్రశ్నగా మిగిలింది.