ఇర్మా తుఫాన్‌.. తెలుగువారు సేఫ్

170
hurricane-irma-florida
- Advertisement -

కరీబియన్‌ దీవుల్లో అల్లకల్లోలం సృష్టించిన హారికేన్‌ ఇర్మా అమెరికాను వణికిస్తోంది. ఫ్లోరిడా కీస్ వద్ద తీరాన్ని తాకిన ఇర్మా.. ప్రచండ గాలులు, కుంభవృష్టి వర్షాలతో బీభత్సం సృష్టిస్తున్నది. ఇర్మా ప్రభావంతో ఫ్లోరిడాలో జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 4 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయోనని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులు, కుటుంబికులు కలవరపడుతున్నారు.

తెలుగువారమంతా క్షేమంగానే ఉన్నామని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఫ్లోరిడాలోని పలు తెలుగు అసోసియేషన్‌ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ అక్కడ తెలుగు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయి తదితర వివరాలను వివరించారు. ప్రవాసభారతీయులు, తెలుగువారు, స్థానిక అమెరికా ప్రజలు విపత్తుకాలంలో ఏకమై పరస్పరం సహకరించుకుంటున్నారని తెలిపారు.

హరికేన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అమెరికా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తెలుగు వారు కూడా చాలా మంది అట్లాంటాకు వెళ్లారు. హోటళ్లలో చాలా మంది తలదాచుకుంటున్నారు. కొంతమంది తమ స్నేహితులు, తెలిసిన వారి ఇళ్లకు వెళుతంటే చాలా మంది అమెరికా ప్రజలు స్వచ్ఛందంగా బాధితులకు తమ ఇశ్లలో ఆశ్రయం కల్పిస్తున్నారని తెలిపారు.

హరికేన్‌ ధాటికి దాదాపుగా ఫ్లోరిడా అంధకారంలో ఉంది. ప్రభుత్వం ముందుగానే హెచ్చరించడంతో ప్రజలందరూ ఇప్పటికే తమకు కావాల్సిన ఆహార సామగ్రి, మందులు తెచ్చి పెట్టుకున్నారు. ప్రొపేన్‌ గ్యాస్‌తో ఇంట్లో వంట చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్స్‌ వ్యవస్థకు కొంత దెబ్బ తగులుగుతోంది. ప్రజలు ఎవరి ఇళ్లలో వారుండిపోతున్నారు. కనీసం కిటీకిలు తెరచి కూడా బయటకు చూసే పరిస్థితి లేదు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఫ్లోరిడాకు ఆగ్నేయ దిశన 30 నుంచి 65 కిలోమీటర్ల వ్యాసంతో వలయాకారంగా తుఫాన్‌ కేంద్రీకరించి ఉందని, ఇది వాయువ్య దిశగా కదులుతున్నదని మియామీలోని నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది.

- Advertisement -