గ్రేటర్ హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే మెట్రో రైల్ సేవల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 28న మెట్రో ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు మెట్రో ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ …ప్రధాని మోడీకి ఆహ్వానం పంపిన లేఖను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన కేటీఆర్…. మెట్రో వివరాలను వెల్లడించారు.
తొలి దశలో నాగోలు నుంచి సికింద్రాబాద్, బేగంపేట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి మీదుగా మియాపూర్ వరకూ మెట్రో పరుగులు పెట్టనుందని వెల్లడించారు. మొత్తం 30 కిలోమీటర్ల పొడవైన రవాణా మార్గం అందుబాటులోకి రానుందని కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం 3 కోచ్‌లతో కూడిన 53 మెట్రో రైళ్లు నగరానికి చేరాయి. నవంబర్ 28వ తొలి దశలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.
నవంబర్ 28 నుంచి 30 వరకూ జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సును ప్రారంభించేందుకు మోడీ హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, యూఎస్ డెలిగేషన్ కు నేతృత్వం వహించనున్నారు. మోడీ పర్యటనలోనే మెట్రో రైల్ ను కూడా ప్రారంభించాలని భావించిన కేసీఆర్, ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.