మరోసారి సంక్రాంతి సమరానికి కాలు దువ్వుతున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. సాధారణంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి బరిలో విజయాన్ని అందుకంటే ఆ ఏడాది మొత్తం విజయం వరిస్తుందన్న నమ్మకం టాలీవుడ్లో ఉండటంతో పండగ బరిలో నిలిచేందుకు హీరోలు సైతం ఆసక్తిచూపుతారు.
ఈ ఏడాది మెగాస్టార్ వర్సెస్ బాలయ్యగా జరిగిన సంక్రాంతి సమరంలో ఇద్దరు పై చేయి సాధించారు. దీంతో వచ్చే ఏడాది సారి సంక్రాంతి పోరుపై ఉహగానాలు జోరందుకున్నాయి. తొలుత సంక్రాంతి సమరంలో రాంచరణ్ రంగస్థలం, మహేష్ స్పైడర్‌తో పాటు బాలకృష్ణ, పవన్ నిలిచారు. అయితే అనుకోకుండా పోటీ నుంచి రాంచరణ్, మహేష్ తప్పుకున్నారు.
రాంచరణ్ ‘రంగస్థలం’ డిసెంబర్ లోనే విడుదలకు ముస్తాబవుతుండగా, అదే సంక్రాంతిని టార్గెట్ చేసిన మహేశ్ బాబు ‘భరత్ అను నేను’ చిత్రం ఆ సమయానికి విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. యూపీలోని చారిత్రక ప్రదేశాల్లో చిత్రం షూటింగ్ జరగాల్సి వుండగా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు ఇవ్వకపోవడంతో సినిమా ఆలస్యమవుతుందని ఇండస్ట్రీ నిపుణులు తేల్చి చెబుతున్నారు.
గత ఏడాది మెగాస్టార్ చిరుతో పోటీ పడ్డ బాలయ్య ఈ ఏడాది పవర్ స్టార్‌తో సమరానికి సిద్దం కానున్నాడు. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 102 మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల కాంబినేషన్ పవన్ – త్రివిక్రమ్ జోడీ తయారు చేస్తున్న చిత్రం జనవరి 10న విడుదలకు ముస్తాబవుతోంది. ఇక పవన్ తొలిసారిగా బాలకృష్ణతో పోటీ పడుతూ సంక్రాంతి రేసులో నిలుస్తుండటం, రెండింటిపైనా భారీ అంచనాలు ఉండటంతో వీరిద్దరిలో విన్నర్ గా నిలిచేది ఎవరో తెలియాలంటే మరో నాలుగు నెలలు వేచి చూడకతప్పదు.