ప్రపంచ టెన్నిస్ సంచలనం, నల్లకలువ సెరెనా విలియమ్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి సెరెనా విలియమ్స్, ఆమె కాబోయే భర్త అలెక్సిస్ ఒహానియన్లకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్టు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. బుధవారం నాటికే ఆమె వెస్ట్ ఫామ్ బీచ్‌లోని సెయింట్ మేరీస్ మెడికల్ సెంటర్లో చేరినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా సదరు ఆస్పత్రిలోని మొత్తం ఫ్లోర్‌ను సెరెనా విలియమ్స్ ఒక్కరికే బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
సెరెనా గత కొన్నేళ్లుగా రిడిట్ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహనియన్‌తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి 2015లో రోమ్‌లో నిశ్చితార్థం జరిగింది. తాను గర్భవతినని సెరెనా ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలిపిన సెరెనా బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.
టెన్నిస్ ఆటగాళ్లతో పాటు అభిమానులు సెరెనాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ని సెరెనా గెలుచుకున్న సంగతి తెలిసిందే. సెరెనా ఇప్పటి వరకు 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ మాజీ నంబర్‌వన్ 2018లో తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టనుంది.