గత కొన్ని నెలలుగా తమిళ రాజకీయాల్లో భారీ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటునే ఉన్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, మళ్లీ మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసిపోయారు. దినకరన్‌ను భయటకు పంపించేశారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై రజనీకాంత్ ఇప్పటివరకు ఓ క్లారిటీ ఇవ్వలేదు.
అయితే రజనీ సంగతి పక్కన పెడితే.. గత కొద్ది రోజులుగా తమిళనాడు రాజకీయాలపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన ప్రముఖ నటుడు కమల్ హాసన్.. తన రాజకీయ ప్రయాణం మొదలైందని చెప్పాడు. బుధవారం ఆయన తమిళనాడులో నిర్వహించిన ఓ వివాహ రిసెప్షన్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు.
ఈ ఫంక్షన్ కేవలం ఓ పెళ్లికి సంబంధించినది కాదని, తన రాజకీయ ప్రవేశ ఆవిష్కరణకు వేదిక అనుకోండని అన్నారు. తన రాజకీయ ప్రయాణం మొదలైందని.. ప్రతీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోండని, డబ్బులు తీసుకుని దొంగలకు ఓట్లేసి మీరే ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేశారన్నారు. రాజకీయ దుస్థితి మారాల్సిన సమయం వచ్చిందని, ఈ పోరాటం కొనసాగుతూనే ఉండాలని కమల్ అన్నారు. కమల్ వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే సూచనలున్నాయని కొంతకాలంగా వస్తున్న పుకార్లకు మరింత వూతమిచ్చినట్లైంది.