‘నేను మారిపోయాను ఇక ఎవరి మీద వివాదాస్పద ట్వీట్లు చేయను, నన్ను నమ్మండి. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్లంతా నన్ను క్షమించండి’ అంటూ వర్మ గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించి మరింత వేడిని రగిల్చిన వర్మ.. ముద్దు సీన్లున్న పోస్టర్లను చించిన కాంగ్రెస్ సినీయర్ నేత వి. హనుమంతరావుపై పలు విమర్శలు చేశాడు. తాజాగా మరోసారి హనుమంతరావుపై కామెంట్ చేస్తూ అర్జున్ రెడ్డి సినిమా యూనిట్ ఓ సలహా ఇచ్చాడు వర్మ. అర్జున్ రెడ్డి యునిట్‌కి నేనిచ్చే సలహా మీ సినిమాలో ఉన్న ముద్దు సీన్లన్నిటినీ బ్యాక్ టు బ్యాక్ కట్ చేసి ఒక పెన్ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన గదిలో ఒక్కరే చూసుకొని తప్పకుండా చిల్ అవుతారని ఓ పోస్టు పెట్టాడు.
ఇక మరో పోస్టులో అర్జున్ రెడ్డి సినిమాను మరోసారి చూశానని, విజయ్ దేవర కొండ టాలీవుడ్ లియోనార్డో డికాప్రియో అనడంలో, అలాగే నటనలోనూ పవన్ కంటే 20 రేట్లు బెటర్ అని ఎలాంటి సందేహం లేదని ప్రశంసించాడు. మిగతా హీరోలు నటించే సంప్రదాయ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ని సూపర్ స్టార్ చేసిందని, డికాప్రియో హాలివుడ్లో చేసే సినిమాల ఫార్ములానే ఈ సినిమా ఫాలో అయిందని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
మరో పోస్టులో అర్జున్ రెడ్డి సినిమా చూసిన తరువాత కూడా తెలంగాణలో విజయ్ దేవరకొండ కంటే పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తే.. వాళ్లు తెలంగాణ ద్రోహులతో సమానమన్నాడు వర్మ. వివాదాలు, ప్రశంసలతో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ చేసిన అర్జున్‌రెడ్డి మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.