విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ . షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో బాక్సీఫీసు వద్ద వసూళ్ల పంట పండుతోంది. సాధారణ ప్రేక్షకుల దగ్గరి నుంచి సినీ ప్రముఖుల వరకు అర్జున్ రెడ్డికి నీరాజనం పడుతున్నారు. ఏకంగా రాజమౌళి, క్రిష్, వర్మ లాంటి దర్శకులు సినిమా ప్రశంసలు గుప్పించారంటే ఏ రేంజ్లో ఉందో అర్దం చేసుకోవచ్చు.
తొలి రోజు రూ. 13.7 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే రూ. 47.34 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో తొలి వారంలో మంచి వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఓవర్సీస్లో సైతం అర్జున్ రెడ్డికి ఎదురులేకుండా పోయింది.
అమెరికాలో తెలుగు వారు ఫ్యామిలీ సినిమాలు, కామెడీ మూవీస్‌ను మాత్రమే ఇష్టపడతారన్న వార్తలను చెరిపేస్తూ మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రం ఇదే కావడం విశేషం.
రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుండటంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. అమెరికాలో ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ. 60 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.