“రూ.100, 50 కరెన్సీ నోట్లు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు రద్దు అవుతాయని, ఆక్టోబర్ 21వరకు ఈ నోట్లను అకౌంట్లో వేసుకోవాలి” అని రెండు రోజుల నుంచి వాట్సాప్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పది రూపాయల నాణాలు చెల్లవంటూ ఇటీవల జరిగిన ప్రచారం తరహాలోనే ఈ ప్రచారం మొదలైంది. కరెన్సీ డిమానిటైజేషన్ తరువాత కొత్త కరెన్సీ నోట్లలో జీపీఎస్ చిప్ లు ఉన్నాయని, ఇంకా ఏవో అని, అవని, ఇవని చాలా రకాల ఫేక్ న్యూస్‌లు వాట్సాప్‌ల్లో చక్కర్లు కొడుతుంటాయి.
మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో తమ యాప్ వేదికగా ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది వాట్సాప్. అందుకోసం వీలున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ కల్పించిన నేపథ్యంలో ఫేక్‌న్యూస్‌ను అరికట్టడం సంక్లిష్టంగా మారింది. సమాచారం పంపేవారు, రిసీవ్ చేసుకునే వారు తప్ప ఇతరులెవ్వరూ ఆ మెసేజ్‌ను చూసే అవకాశం లేకపోవడంతో ఇది కష్టతరంగా మారింది.
ఫేక్ న్యూస్‌పై తమ యూజర్లను అప్రమత్తం చేస్తున్నామని, ఎదైనా సమాచారం వస్తే నిర్ధారించుకున్న తరువాతనే షేర్ చేసుకొండని వాట్సాప్ యాజమాన్యం చెబుతోంది. వాట్సాప్‌లో అభ్యంతరకరమైన వీడియోలు షేర్ చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వాట్సాప్‌ను కోరారు. వాట్సాప్ లో ఎదైనా అభ్యంతరకరమైన కంటెంట్ వస్తుంటే, వెంటనే యూజర్లు స్క్రీన్ షాట్ తీసి అందుకు సంబంధించిన అధికారులకు పంపాల్సిందిగా మంత్రి సూచించారు.
అయితే రూ.100, 50 కరెన్సీ నోట్లు రద్దు అవుతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. దీనిపై ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఏలాంటి సమాచారంలేదు. పది రూపాయల నాణాలు చెల్లవంటూ ఇటీవల జరిగిన ప్రచారం తరహాలోనే ఈ ప్రచారం జరుగుతోంది. ప్రజలు ఈ వదంతులను నమ్మరాదు..