అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి బాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ కు శిక్షను ఖరారు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్ధారం. ఇద్దరి మహిళలపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మిత్‌కు రెండు కేసుల్లో పదేళ్ల చొప్పున మొత్తం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.15 లక్షల చొప్పున రూ.30లక్షలు కోర్టు జరిమానా విధించింది. తీర్పు నేపథ్యంలో బాబా అనుచరులంతా సహనం పాటించాలని డేరా సచ్చ సౌధా ప్రతినిధి, గుర్మీత్ కూతురు విపాసన కోరింది.
జైలులో ఇరువర్గాల వారికి వాదనలు వినపించేందుకు జడ్డి జస్టిస్ జగదీప్ సింగ్ పది నిమిషాలు టైం కేటాయించారు. బాబా రామ్ రహీం సోషల్ వర్కర్ అని ఎంతో మంది పేదవారి అభ్యున్నతికి పాటు పడిన వ్యక్తని వాదనలు వినిపించిన ఆయన తరపు లాయర్ గుర్మీత్ ఆరోగ్యం, వయస్సు, సోషల్ సర్వీస్‌ను దృష్టిలో పెట్టుకొని శిక్షను విధించాల్సిందిగా కోరారు. వాదనలు వినిపిస్తున్న సమయంలో గుర్మీత్ కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాధితులకు జరిగిన అన్యాయం దృష్ట్యా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని సీబీఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
తీర్పు వెలవడిన నేపథ్యంలో హర్యానా,పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బల్క్ ఎస్సెమ్మెస్, మొబైల్, ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. రోహ్తక్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్మీత్ అనుచరులు విధ్వంసానికి పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు కాల్పులకు కూడా వెనుకాడబోమని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
గుర్మీత్ ఉన్న సునారియా జైలు పరిసర ప్రాంతాల్లో మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు . అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశారు. హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకున్నారు. గుర్మీత్ అరెస్ట్‌తో ఇప్పటివరకు 30 మందికి పైగా మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. వందల కోట్ల ఆస్తిని ధ్వంసం చేశారు బాబా అనుచరులు.
పూర సచ్చా పేరుతో స్థానికంగా ఓ దిన పత్రికను నడిపే జర్నలిస్ట్ ఛత్రపతి సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఇద్దరు మహిళలపై గుర్మీత్ బాబా అత్యాచారానికి పాల్పడినట్లు 2002లో బయటపెట్టారు. రామ్ రహీమ్ సింగ్ లైంగిక వేధింపులను బయటపెట్టిన కొద్ది నెలల తర్వాత అంటే 2002 అక్టోబరు 24 న జర్నలిస్ట్ ఛత్రపతి పాయింట్ బ్లాక్‌పై తుపాకితో కాల్చుకుని తన నివాసం సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో 2002 డిసెంబరు 12 న సీబీఐ కేసు నమోదు చేసింది.