ముస్లిం సామాజికవర్గంలో అమల్లో ఉన్న వివాదాస్పద విడాకుల విధానం ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు మంగళవారం చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాఖ్ చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం, ఎంతమాత్రం చెల్లబోదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ విధానంపై ఆరు నెలల్లోపు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం మహిళలు, మహిళా సంఘాలు స్వాగతించాయి. సుప్రీం తీర్పుతో కొత్త శకం ఆరంభమైందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న ముస్లిం మహిళలకు అనుకూలంగా వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్రమంత్రి మేనకా గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా తలాక్‌పై చట్టాన్ని తీసుకురావాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని అయితే క్షేత్రస్థాయిలో తీర్పు అమలు చేయడం మాత్రం సవాలే అని ఎంఐఎం నేత,ఎంపీ అసదుద్దీన్ అన్నారు.
ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా సమర్థించి స్వాగతిస్తున్నానని ఈ కేసు పిటిషనర్ సైరా భాను తెలిపారు. ముస్లిం మహిళలకు ఇది నిజంగా చరిత్రాత్మక రోజు అని ఆమె అభివర్ణించారు. తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లినందుకు సైరాభానుకు ఆమె భర్త రియాజ్ అహ్మద్ 2015, అక్టోబరు 15న ఓ పేపరు మీద ముమ్మారు తలాక్ అని రాసి విడాకులు ఇచ్చేశాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆమె 2016, ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.