తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డు కేసీఆర్‌ను వరించింది. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో ఈ అవార్డు ప్రదానం కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారత ఆహార, వ్యవసాయ మండలి అవార్డును అందజేయనుంది.
లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా కేసీఆర్‌కు ఈ అవార్డు ప్రధానం చేస్తున్నట్లు భారత ఆహార, వ్యవసాయ మండలి స్పష్టం చేసింది. ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పైన కాళేశ్వరం, కింద పాలమూరు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది.
అనుకున్న గడువు కంటే ముందే ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. అంతే కాకుండా రైతన్నలకు ఆసరాగా నిలిచేందుకు సీఎం కేసీఆర్.. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వబోతున్నారు. కేసీఆర్‌కు అవార్డు రావడంతో రైతాంగం, టీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.