దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యంగ పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించనున్న తొలి తెలుగువాడిగా వెంకయ్య నాయుడు చరిత్ర సృష్టించనున్నాడు. ఉభయసభల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్న ఎన్టీఏ అభ్యర్ధి వెంకయ్య గెలుపు నల్లేరుపై నడకే కానుంది. దీంతో రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తి అదే సభకు ఛైర్మన్‌గా ఎన్నికవుతుండటం కూడా చరిత్రలో ఇదే తొలిసారి కానుంది.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పోలింగ్‌లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓట్లు వేయనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రం ఏడు గంటల కల్లా ఫలితాన్ని వెల్లడిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
లోక్‌సభలో 545, రాజ్యసభలో 245 మంది కలిపితే మొత్తం 790 మంది ఎలకో్ట్రరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. నామినేటెడ్ సభ్యులూ ఓటేయడానికి అర్హులే. ఒక్కో సభ్యుడికి ఒక్కో ఓటు మాత్రమే ఉంటుంది. 396 ఓట్లు సాధించిన వారు గెలుస్తారు. రాజ్యసభ్యలో మూడు, లోక్‌సభలో రెండు ఖాళీలు ఉండటంతో మ్యాజిక్ ఫిగర్ 394కే పరిమితమైంది.
ఓటమి ఖాయమని తెలిసినా కాంగ్రెస్ గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దింపింది. 20 పార్టీల మద్దతుతో రెండు సభల్లో కలిపి గోపాలకృష్ణకు 276 ఓట్ల బలం ఉండగా వైసీపీ, టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే, నామినేటేడ్, స్వతంత్రుల ఓట్లు కలిపితే వెంకయ్యకు కనీసం 482 ఓట్లు వస్తాయి. నామినేటేడ్ ఎంపీల ఓట్లతో వెంకయ్యకు 500 ఓట్ల వరకూ రావచ్చని అంచనా.
అలుపెరగని రాజకీయ నేతగా పెరుపొందిన వెంకయ్య రాజకీయ ప్రస్థానం అపూర్వం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన పోరాడిన తీరు అందరికి ఆదర్శం. నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో 1949 జూలై 1న జన్మించారు. నెల్లూరు వీఆర్ హైస్కూలులో పాఠశాల విద్యను అభ్యసించారు. వీఆర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగం డిగ్రీ పట్టా పొందారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు.
కాకాని వెంకటరత్నం నేతృత్వంలో 1972లో ప్రారంభమైన జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ ఉద్యమంతో వెంకయ్య నాయుడుకు సమాజంలో మంచి గుర్తింపు వచ్చింది. సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఛత్ర సంఘర్ష్ సమితికి ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్‌గా 1974లో నియమితులయ్యారు. ఆ తర్వాత కాలంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక 1977లో జనతా పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించి 1980 వరకు కొనసాగారు. ఇక అక్కడి నుంచి రాజకీయంగా వెనుదిరిగిచూసుకోలేదు.
బీజేపీ పార్టీలో కీలకంగా ఉన్న వెంకయ్య నాయుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి సారి 1978లో ఒకసారి, 1983లో మరోసారి గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతర కాలంలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి 1998లో కర్నాటక నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తిరిగి 2004లో రెండోసారి, 2010లో మూడు సారి అదే రాష్ట్రంలో రాజ్యసభకు వెళ్లారు. 1999లో వాజ్‌వేయి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్న వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.
1973-74 : ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు
1974 : యువజన ఛత్ర సంఘర్ష సమితికి ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్
1977-80 : జనతా పార్టీ యూత్ వింగ్‌కు ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు
1978-85 : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యుడు (రెండు సార్లు)
1980-85 : బీజేపీ శాసనసభా పక్ష నేత
1985-88 : ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి
1988-93 : ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
1993- 2000 : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
1996- 2000: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి
1998 నుంచి ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడు
30/07/2002 – 01/07/2002 : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
01/07/2002 – 05/10/2004 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు
ఏప్రిల్ 2005 నుంచి పార్టీ జాతీయ ఉపధ్యక్షుడు
2006 నుంచి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ
26 మే 2014 నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి