సినిమాల్లో ఉన్నా, లేకున్నా.. గ్లామర్‌లో ఆమె స్టార్. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీకి ఆమె బ్రాండ్ లీడర్.పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేసిన అలనాటి తార జయప్రద. తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న జయప్రద తాజాగా మళ్లీ మేకప్ వేసేందుకు సిద్దమవుతోంది.
ఓ విభిన్న కథాంశంతో తాను రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపింది జయప్రద. ఈ సినిమా వివాదాలకు కేంద్రబిందువు కావొచ్చేమోనని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేరళ, తమిళనాడు మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంగా మలయాళ దర్శకుడు ఎంఎ నిషాద్ ఓ సినిమాని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు కెని అనే పేరు పెట్టారు కూడా.
తమిళ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తీపన్ ఈ చిత్రంలో జయప్రద సరసన నటిస్తున్నాడు. అయితే ఇరు వర్గాలు కయ్యానికి కాలు దువ్వుతూ నిప్పును రాజేసుకుంటున్న సమయంలో గొడవ పడకుండా సమస్యను ఎలా పరిష్కరించవచ్చునో అర్థం చేయించే పాత్రలో పార్తీపన్ నటిస్తున్నాడట. జయ ప్రద పాత్రకి సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
జయప్రద రీ ఎంట్రీ ఇస్తుందన్న వార్తతో ఆమె ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. అయితే, తమిళ, కన్నడీయుల సెన్సిటివ్ విషయాన్ని కదిలిస్తుండటంతో ఈ సినిమా కథ ఎలా వుండబోతుందదనేది హాట్ టాపిక్ గా మారింది.