మాస్ మహారాజా రవితేజ నేడు సిట్ ముందు విచారణకు హాజరుకానున్నాడు. ఈ మధ్యే కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భరత్ పలు సందర్భాల్లో డ్రగ్స్ వివాదంలో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. సిట్ నోటీసులు జారీ చేసినవారిలో రవితేజ పేరు వెలుగు చూడడంతో టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. ఈ సమయంలో రవితేజ పేరు చెడగొడుతున్నాడంటూ అతనిపై విమర్శలు కూడా వెలువడ్డాయి. అయితే కెల్విన్, జిషాన్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. రవితేజకు కెల్విన్ ను పరిచయం చేశానని, డ్రగ్స్ కూడా సరఫరా చేశానని జిషాన్ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో పరీక్షలకు సహకరిస్తాడా? లేదా?, అతనిని సిట్ ఏరకంగా విచారించనుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. సిట్ కు రక్తనమూనాలతో సహా ఏవీ ఇచ్చేది లేదని హైకోర్టులో పోరాడి సాధించిన ఛార్మీ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇక ముమైత్ కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే వెనుదిరిగినట్టు తెలుస్తోంది.
తన కుమారుడు నిప్పులాంటి వాడని టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. నేడు విచారణ సమయానికి సిట్ కార్యాలయానికి తన కుమారుడు వస్తాడని ఆమె చెప్పారు. ఏవైనా అలవాట్లు ఉంటే తాము భయపడాలి కానీ, ఏ అలవాట్లు లేని తన కుమారుడి పట్ల తమకు భయం ఎందుకని ఆమె ప్రశ్నించారు. విచారణలో ఎదురయ్యే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాడని, సిట్ అధికారులు కోరితే పరీక్షల కోసం రక్తనమూనా ఇచ్చేందుకు కూడా సిద్ధమని ఆమె అన్నారు. దీంతో రేపటి విచారణ పట్ల రవితేజ స్పష్టంగా ఉన్నట్టు అర్ధమవుతోంది.