ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందించి ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది రిలయన్స్ జియో. దాంతో జియో వేగానికి టెలికాం కంపెనీలు ఒకొక్కటిగా దిగొస్తున్నాయి.
జియోని దెబ్బకొట్టే విధంగా ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో లీడింగ్ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ రెండు కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది.
జియో తరహాలో ప్రతినెల రూ.300కు 30 జీబీ డేటా కాకుండా.. కేవలం రూ.145కే 14జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇవ్వనుంది. దీంతోపాటు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం కూడా కల్పించింది. ఇక రూ.349 రీచార్జ్ ప్యాక్‌లో 14 జీబీ 3జీ లేదా 4జీ డేటాతోపాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సదుపాయం.
జియోలో నెలకు రూ. 303 తో రిచార్జ్ చేసుకోవాల్సి ఉండగా అంతకంటే తక్కువ ధరకే ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ని అందిస్తోంది. జియోలో ప్రైమ్‌మెంబర్లుగా చేరడానికి ముందుగా రూ.99 చెల్లించాల్సి ఉండగా, ఎయిర్‌టెల్‌లో అది కూడా అవసరంలేదు. మొత్తానికి జియో దెబ్బకి ఎయిర్‌టెల్ ఒకేసారి రెండు ఆఫర్లను ప్రకటించేసింది.