భారత్ – శ్రీలంక మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఒపెనర్ శిఖర్ ధావన్ చెలరేగడంతో 399 పరుగులు చేసింది.. ఓపెనర్ అభినవ్ ముకుంద్ (12) విఫలం అయినా.. శిఖర్ ధావన్ ట్వింటీ 20 తరహాలో మ్యాచ్ ఆడాడు. 168 బంతుల్లోనే 190(31×4) రన్స్ చేసి పది పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అంతేకాదు 190 పరుగులు చేసిన క్రమంలో… ఒక్క సెషన్ లో ధావన్ 126 పరుగులు చేశాడు. ఒక్క సెషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ గా సెహ్వాగ్ మీద ఈ రికార్డు ఉంది. 2009లో శ్రీలంకతో జరిగిన టెస్టులో ఒకే సెషన్ లో సెహ్వాగ్ 133 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. కేవలం 7 పరుగుల తేడాతో సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం తృటిలో కోల్పోయాడు ధావన్.
110 బాల్స్ లో సెంచరీ పూర్తి చేసిన శిఖర్.. ఆ తర్వాత 58 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న ధావన్‌ను కట్టడి చేయడానికి శ్రీలంక అన్ని ప్రయత్నాలు చేసింది.. ఫీల్డర్లను, బౌలర్లను పదేపదే మార్చింది. ఎట్టకేలకు షీ సెషన్ కి వెళ్లే సమయంలో ప్రదీప్ బౌలింగ్ లో మాధ్యూస్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేశాడు. ధావన్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ మూడు పరుగులకే ఔట్ అయ్యి నిరాశ పరిచాడు.
మరోవైపు టీమిండియా స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా ధావన్‌కు అండగా నిలిచి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పుజారా 144 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్ లో రహానే 39 పరుగులతో ఆడుతున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానకి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 399 పరుగులు. ఈ మూడు వికెట్లను శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ తీయడం విశేషం.