హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ అవగాహన పాదయాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ సందడి చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వెంకటేశ్ హాజరై డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగస్వాములయ్యారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్ర చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ నేతలు, చిన్నారులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు.
Also Read:అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్
డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా కలిసి పనిచేయాలని సూచించారు.

