తెలంగాణలో ఇద్దరు షాడో సీఎంలు!

0
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, ప్రభుత్వ వ్యవహారాలపై అసమ్మతి ఎమ్మెల్యేలు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సందీప్ కుమార్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి జరిపిన సమావేశం ముగిసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, నిధుల కేటాయింపులు, అధికారుల వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక నివేదిక సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించడం లేదని, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇద్దరు షాడో సీఎంలు వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని నివేదికలో పేర్కొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించకుండా మౌనంగా ఉండాలని సందీప్ కుమార్ సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ అసమ్మతి ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాల విషయంలో వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరులో మార్పులు రావాలని, ఎమ్మెల్యేల సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని పట్టుబట్టినట్లు సమాచారం.

Also Read:అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్పించిన నివేదికలోని అంశాలు బయటకు రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చ మొదలైంది. ఈ పరిణామం సీఎం రేవంత్ రెడ్డి వర్గంలో ఆందోళనకు కారణమైందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సందీప్ కుమార్‌తో వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు నేతలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి వర్గం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

- Advertisement -