HMDA భూ వేలంపై బీఆర్ఎస్ ఆందోళన..

1
- Advertisement -

తెలంగాణలో భూముల వేలం వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ ప్రాంతాల్లో భూముల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ నెల 27న హెచ్ఎండీఏ (HMDA) నిర్వహించనున్న ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, స్థానికులు అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.

ఈ నిరసనలో హుడా ట్రక్ పార్క్ బాధితులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడమేనా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం వల్ల రాష్ట్ర సంపద పెరగదని, భవిష్యత్తు అవసరాల కోసం భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే కూకట్‌పల్లి ప్రాంతంలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం విక్రయించిందని నిరసనకారులు ఆరోపించారు. తాజాగా మరో రూ.5 వేల కోట్ల విలువైన భూములను వేలం వేయడానికి సిద్ధమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Also Read:అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్

ఈ క్రమంలో హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకు దిగిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుల క్యాంపు కార్యాలయానికి తరలించారు. భూముల వేలం రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

- Advertisement -