అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల పెంపునకు సిద్ధమవుతోంది. భారత్, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ వారంలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. అధిక పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా అమెరికా కంపెనీలకు నష్టం కలిగిస్తున్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకునే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ మార్చి 11న ప్రారంభించిన దర్యాప్తు నివేదికను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్ సహా మొత్తం 16 దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ విచారణ చేపట్టారు. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం ఈ దర్యాప్తు జరుగుతోంది. అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు పాల్పడినట్లు తేలితే ఆయా దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది.
ఈ దేశాల్లో ప్రభుత్వ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి అవసరానికి మించి పెరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. దీంతో ఆయా దేశాల కంపెనీలు తక్కువ ధరలకు వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తూ అమెరికా తయారీ రంగానికి పోటీగా నిలుస్తున్నాయని పేర్కొంటోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియాలపై 15 శాతం లేదా అంతకంటే తక్కువ టారిఫ్‌లు విధించే అవకాశం ఉండగా.. భారత్, వియత్నాంపై అంతకంటే ఎక్కువ సుంకాలు విధించవచ్చని అంచనా. అయితే భారత్‌పై ఎంత శాతం టారిఫ్ విధించనున్నారనే విషయాన్ని నివేదిక వెల్లడించలేదు. చైనాపై మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే అధిక సుంకాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read:అటెండర్ మణి పాడె మోసిన సంతోష్ కుమార్

