హైదరాబాద్: నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ నాయకులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)ను డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నాయకుల బృందం హైదరాబాద్‌లోని జలసౌధకు వెళ్లి KRMB చైర్మన్‌ను కలిసింది. నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు నిర్మాణ పనులు చేపట్టిందని ఆరోపించారు. ఈ పనులను ప్రారంభించే ముందు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB), కేంద్ర జల సంఘం (CWC), తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఈ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయించాలని బోర్డు అధికారులను కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగించుకుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ మరోసారి అక్రమంగా నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టిందని తీవ్ర విమర్శలు చేశారు.
Also Read:బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఎందుకు?
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నిర్మాణాల వల్ల తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఐదు జిల్లాల్లోని సుమారు రెండున్నర కోట్ల మంది ప్రజల నీటి అవసరాలపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులపై తక్షణమే స్పందించి, వాటిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని KRMB చైర్మన్‌ను కోరినట్లు జగదీష్ రెడ్డి వెల్లడించారు.

