రేవంత్‌కి పాడి కౌశిక్ రెడ్డి సవాల్

2
పాడి కౌశిక్ రెడ్డి
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తన నియోజకవర్గంలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలా నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో పెన్షన్ల సంఖ్య తగ్గిపోయిందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గత మూడేళ్లలో నియోజకవర్గంలో 5,250 పెన్షన్లను తొలగించగా, కొత్తగా 4,221 పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారని వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం కొత్త పెన్షన్లు ఇవ్వడం మాట అటుంచితే.. ఉన్న పెన్షన్లలోనూ 1,029 తగ్గిపోయాయని విమర్శించారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందాల్సిన సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Also Read:దేశంలో పెరిగిన మత్య్స సంపద

హుజూరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదన్న తన ఆరోపణను తప్పని నిరూపించాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారిక లెక్కలతో ఈ విషయాన్ని నిరూపించాలని డిమాండ్ చేశారు.

తన సవాల్‌ను స్వీకరించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు.

- Advertisement -