140 సార్లు మా పేర్లు తలుచుకున్న రేవంత్‌?

4
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమంపై నిర్వహించిన సభలో ప్రజలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్, తన పేర్లను పదేపదే ప్రస్తావించారని ఆరోపించారు.

గంట వ్యవధిలో రేవంత్ రెడ్డి తమ పేర్లను 140 సార్లు ప్రస్తావించారని హరీశ్ రావు అన్నారు. ఇందులో కేసీఆర్ పేరు 63 సార్లు, తన పేరు 53 సార్లు, కేటీఆర్ పేరు 24 సార్లు తీసుకున్నారని వెల్లడించారు. తమ పేర్లను ఇన్ని సార్లు ప్రస్తావించారంటే రేవంత్ రెడ్డికి ఎంత భయం పట్టుకుందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.

మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లిని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

గతంలో శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్యేగా పోటీకి నిలబెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడించిందని గుర్తుచేశారు. ఉద్యమకారులపై నిజంగా ప్రేమ, గౌరవం ఉంటే అప్పుడే ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందని వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇటీవల సిరిసిల్ల పర్యటనలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారని, తాజాగా సిద్దిపేటలోనూ ఇదే తరహా హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Also Read:జటాయు ఎర్త్ సెంటర్‌కు మోదీ

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లోనే మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, ముందుగా వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సొంత కేబినెట్‌లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడానికే ముఖ్యమంత్రి వెనుకాడుతున్నారని విమర్శించారు. ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఏ ఎమ్మెల్యే పార్టీని వీడతారోననే భయం ఆయనలో ఉందని ఆరోపించారు.

రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో గెలుస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో మంత్రి పదవులు ఇస్తానంటూ హామీలు ఇవ్వడం తుపాకీ రాముడి మాటలను తలపిస్తోందని వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

- Advertisement -